-క్యూ లైన్ లో భక్తులతో మాట్లాడిన ఎంపి కేశినేని, హోం మినిస్టర్ అనిత
-స్వయంగా సదుపాయాలు, సౌకర్యాలు పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాలు, ఏర్పాట్లపై భక్తులు తొంభై శాతంకి పై సంతృప్తి వ్యక్తం చేశారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఇంద్రకీలాద్రి పై బుధవారం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తో కలిసి కొండ దిగవ నుంచి పైవరకు ఉన్న భక్తుల క్యూ లైన్ లను పరిశీలించి వారితో మాట్లాడటం జరిగింది. వీరితో పాటు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు కూడా వున్నారు. భక్తులతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ సృజన, ఈవో కె.ఎస్.రామారావుకి ఎంపి కేశినేని శివనాథ్ పలు సూచనలు, సలహాలు అందించారు.
. కొండపైన దర్శనం కోసం క్యూ లైన్ లో వచ్చే భక్తులను ఏర్పాట్ల పై, దర్శన సమయంపై ఎంపి కేశినేని శివనాథ్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో మాట్లాడుతూ వారికి పాలు పంపిణీ చేశారు. ఇంద్రకీలాద్రి పై భక్తులకి పంపిణీ చేసే పాల కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని కిందకి వచ్చే భక్తులతో మహామంటపం దగ్గర మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. వయోబేధం లేకుండా మహిళలు,వృద్దులు, యువతీ యువకులందరీ అభిప్రాయలు అడిగి తెలుసుకున్నారు.
క్యూ లైన్ లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయటం పై ఎంపి కేశినేని శివనాథ్, హోమ్ మినిస్టర్ అనిత వారికి కృతజ్ఞతలు తెలిపారు. మూల నక్షత్రం నాడు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో విఐపి పాసులు రద్దు చేయటం జరిగిందని భక్తులకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ శరన్నవరాత్రులలో అత్యంత విశేషమైన మూలా నక్షత్రం రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రద్దీని నియంత్రించేందుకుగాను తాము ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం సాఫీగా జరుగుతుందని భక్తులు తమతో స్వయంగా అనటం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. భక్తులకి ఎక్కడా ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించామని తెలిపారు.