మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులు వారు తీసుకున్న పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లింపు మారిటోరియం (తాత్కాలిక నిషేధం)తో కలిపి రెండు సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ఈ విధంగా చేసుకుంటే రైతుల నుండి అదనంగా ఎలాంటి జరిమానా వడ్డీ వసూలు చేయడం జరగదన్నారు. ఈ సౌకర్యం వర్తించాలంటే సంబంధిత పంట రుణము చెల్లించే గడువు దాటిపోయి ఉండకూడదన్నారు.
కావున జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతులు వారికి సంబంధించిన బ్యాంకులను సంప్రదించి వారి పంట రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే బ్యాంకర్లు కూడా వారిని సంప్రదించిన రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలిగించకుండా అన్ని విధాల సహకారం అందించి వారి పంట రుణాలు రీ షెడ్యూల్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.