విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ తపాలా వారోత్సవాలు మరియు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డి.ఎస్.వి.ఆర్.మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లోని పోస్టాఫీసులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ “విజయవాడ హెడ్ పోస్టాఫీసు ను విజయవాడ జనరల్ పోస్టాఫీసుగా పేరు మార్చడం” గురించి తెలియజేశారు. ఇండియా పోస్ట్ తన సాంకేతిక అంశాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన ఇంటర్ఫేస్‌ను మారుస్తు మరియు అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా గతంలో కంటే నేడు మరింత ముఖ్య పాత్రను కలిగి ఉందన్నారు. 2024లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ప్రజలను కమ్యూనికేషన్, సాధికారత చేకూర్చడం అనే థీమ్ ఈ సంవత్సరం ప్రపంచ పోస్ట్ డే యొక్క దీర్ఘకాల విజయాలను గుర్తిస్తుందని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమ్మేళనంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్–2024 నిర్వ హిస్తున్నట్లు తెలియజేశారు. ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రతిఒక్కరిని ఆరోగ్యంపై పునరాలోచింపజేయడమే పోటీల లక్ష్యమని చెప్పారు. 3కె, 5కె, 10కె విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలుగా నిలిచినవారికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో తపాలాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.