-ఎమ్మెల్యే చేతుల మీదుగా 300 మంది పేదలకు ఉచితంగా ఆనందయ్య మందు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా విపత్తు సమయంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ కండ్రికలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వీకేఎస్సీ (వాసవీ కుటుంబ సురక్ష పథకం) ద్వారా కరోనాతో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు ప్రసంగిస్తూ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా మానవతా దృక్పథంతో ఆదుకోవడం అభినందనీయమన్నారు. స్వచ్ఛంధ సంస్థలు సేవా దృక్పథంతో నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వెల్లడించారు. మరోవైపు మానవాళిని కరోనా వైరస్ కబలిస్తోన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. కరోనా కోరల్లో చిక్కుకున్న బాధితులకు ఆనందయ్య మందు సంజీవిని లాంటిదని చెప్పుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని.. సత్యనారాయణపురం, సూర్యారావుపేట సహా పలు చోట్ల ఆనందయ్య మందును పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ఆనందయ్య మందు తీసుకున్న వారు సైతం అజాగ్రత్తగా ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు బొడ్డు శ్రీనివాసరావు, ఇమిడిశెట్టి సంతోష్ చక్రవర్తి, పొట్టి శివకుమార్, సతీష్, కోళ్ల రామారావు, నాయకులు సీహెచ్ రవి, నాగు, ఉద్దంటి శీను తదితరులు పాల్గొన్నారు.