Breaking News

నారీశక్తి ఉత్సవం” కు హాజరుకావాలని  మంత్రి కందుల దుర్గేష్ కు టూరిజం ఎండీ అభిషిక్త్ కిషోర్ ఆహ్వానం

-మంత్రి కందుల దుర్గేష్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన ఎండీ అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్.. సానుకూలంగా స్పందించిన మంత్రి దుర్గేష్
-టూరిజం శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బూరి గ్రౌండ్ లో ఈనెల 11,12,13 తేదీల్లో నారీశక్తి ఉత్సవం
-అధ్యాత్మికతను స్ఫురించేలా, మహిళా సాధికారతను చాటేలా 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు
-దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలు కనబర్చిన మహిళలకు పురస్కారాల ప్రదానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బూరి గ్రౌండ్ లో ఈనెల 11,12,13 తేదీల్లో “నారీ శక్తి ఉత్సవం” ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరుకావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు టూరిజం ఎండీ ఎం.అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్ ఆహ్వానం పలికారు. ఈ మేరకు గురువారం ఉదయం సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని మంత్రి కందుల దుర్గేష్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా సాధికారతను చాటి చెప్పేలా నిర్వహించే నారీ శక్తి ఉత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎండీ అభిషిక్త్ కిషోర్ మంత్రి దుర్గేష్ కు అందజేశారు. నారీ శక్తి ఉత్సవంలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలు కనబర్చిన శక్తివంతమైన మహిళలను సన్మానించడం జరుగుతుందని, మహిళా మణులకు విశిష్ట పురస్కారాలు అందజేస్తున్నామని ఈ సందర్భంగా అభిషిక్త్ కిషోర్ మంత్రికి వివరించారు. అదే విధంగా మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో వక్తల ప్రసంగాలతో పాటు కృష్ణా నది ఒడ్డున ఆహ్లాదరకరమైన వాతావరణంలో నవదుర్గలు ప్రతిబింబించేలా మహా హారతి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, కోలాటం, డప్పు, తప్పెట గుళ్లు, తెలంగాణ బోనాలు వంటి కళా ప్రదర్శనలు, హస్తకళా ప్రదర్శనలతో పాటు జాతీయ అంతర్జాతీయ రుచులతో ఫుడ్ ఫెస్టివల్, బొమ్మల కొలువు, దసరా ఉత్సవాల చరిత్ర, అధ్యాత్మికత ఉట్టిపడేలా కనకదుర్గ అమ్మవారి చరిత్రను వివరించేలా డ్రోన్ షో తదితర కార్యక్రమాలుంటాయని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సతీమణులు, మహిళా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, న్యాయమూర్తుల సతీమణులు తదితరులు పాల్గొంటారని ఎండీ అభిషిక్త్ కిషోర్ మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *