విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తికి సన్మానం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక పరంపరలను ఘనంగా చాటే “శక్తి విజయోత్సవం” అక్టోబర్ 11, 12,13 తేదీలలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద కన్నుల పండగలా జరుగుతుందని సంస్థ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు . ఈ మహోత్సవం దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దుర్గాదేవి యొక్క నవ శక్తి స్వరూపాలను స్మరించేందుకు, మహిళల్లో అంతరంగాన నిబిడీకృతమై ఉన్న శక్తి, ధైర్యం, పట్టుదల వంటి అంశాలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సతీమణులు, పర్యాటక శాఖ, హోం శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, గౌరవ న్యాయమూర్తుల సతీమణులు, ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీ చైర్మన్ ల సతీమణులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ ఎస్ అధికారుల సతీమణులు, వరద బాధిత ప్రాంతాల నుండి కొంతమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి మహిళా శక్తి గురించి ప్రత్యేక ప్రసంగం చేస్తారన్నారు.
పవిత్ర కృష్ణా నది ఒడ్డున బబ్బూరి గ్రౌండ్స్ (పున్నమి ఘాట్) ఈ కార్యక్రమానికి అందమైన వేదికగా నిలిచిందన్నారు . దుర్గమ్మ తొమ్మిది అవతారాలను ప్రతిబింబించే లైటింగ్ వెలుగుల్లో కాంతులు విరజిమ్మే పడవలు ఘాట్ వద్ద రాత్రి సమయంలో శోభిస్తాయని అని తెలిపారు. మహా హారతి, శంఖనాదం, నృత్య విభావరి, సంగీత ప్రదర్శనలు, అలాగే అధర్మం పై ధర్మం గెలుపును సూచించే కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయన్నారు.
ఈ మహోత్సవంలో వివిధ రకాల హస్తకళల బజారు, వివిధ రుచికరమైన తెలుగు, భారతీయ, విదేశీ వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయబడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కళలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రత్యేక హస్తకళల ప్రదర్శన, వివిధ వంటకాల మేళవింపు ఈ ఉత్సవానికి మరింత శోభనిస్తాయన్నారు.
11 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు ఉత్సవం కొనసాగుతుండగా, ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్త్రీ శక్తిని, ఆధ్యాత్మికతను మేళవించి ఘనంగా జరుపుకోవడం కోసం ప్రజలు అసంఖ్యాకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ విజ్ఞప్తి చేస్తుందని ఆయన తెలియజేశారు.
కార్యక్రమ ప్రధానాంశాలు:
. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్ వద్ద ఈ కార్యక్రమాలు 11,12,13 మూడు రోజులు పాటు నిర్వహించబడుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి.
. దుర్గమ్మ తొమ్మిది స్వరూపాలకు ప్రత్యేక హారతి కార్యక్రమం
. అధర్మం పై ధర్మానికి విజయాన్ని ప్రతిబింబించే దుర్గామాతకు సంబంధించిన కూచిపూడి ప్రదర్శన
. డ్రోన్ షో ద్వారా ఆధునిక సాంకేతికత మరియు సంప్రదాయాలను కలిపి విజయదశమి ప్రత్యేకతను ఆవిష్కరించటం.
. బోనాల నృత్య ప్రదర్శన, కోలాటం వంటి సాంస్కృతిక జానపద కళా ప్రదర్శనలు
. అద్భుతమైన బాణాసంచా ప్రజ్వలన కార్యక్రమం జరుగుతాయి.