-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు అని.. మన పూర్వీకులు అందించిన వేదాల్లో అనంతమైన విజ్ఞానం దాగి ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మల్లాది వేంకట సుబ్బారావు – బాలత్రిపుర సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని తన స్వగృహంలో శుక్రవారం వేద సభ నిర్వహించారు. నవరాత్రులలో మహర్నవమికి ఎంతో విశిష్టత ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గత 40 ఏళ్లుగా ఇదేరోజున అమ్మవారి ఉపాసకులు బాలా త్రిపుర సుందరమ్మ ఆధ్వర్యంలో వేద సభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ.. ట్రస్ట్ ద్వారా బాలా త్రిపుర సుందరమ్మ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. భారతదేశంలో వేల సంవత్సరాల నుండి వేద విజ్ఞానం పరిఢవిల్లుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. వేదం భగవంతుని స్వరూపమని.. విశ్వమానవ శ్రేయస్సు కోసమే భగవంతుడు వేదాలను సృష్టించాడని చెప్పారు. వేద పారాయణం జరిగే చోట సాక్షాత్తూ అమ్మవారు కొలువై ఉంటారని చెప్పుకొచ్చారు. ఆ జగన్మాత దివ్య ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన, రాష్ట్ర ప్రజలందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం వేద పండితులు, ఘనాపాఠిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మల్లాది రాజేంద్ర, మల్లాది శ్రీనివాస్, శర్వాణి మూర్తి, మల్లెం శ్రీను, యల్లాప్రగడ సుధీర్, వేద పండితులు విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి, దుర్భాకుల గురునాథ ఘనపాఠి, విష్ణుభట్ల వేంకట సుబ్రహ్మణ్య ఘనపాఠి, రెండుచింతల యజ్ఞనారాయణ ఘనపాఠి, హరి సీతారామశర్మ ఘనపాఠి, దెందుకూరి సదాశివ ఘనపాఠి సోమయాజి, మంగిపూడి వేంకటశాస్త్రి ఘనపాఠి, హరీష్ ఘనపాఠి, దెందుకూరి శ్రీ రామ ఘనపాఠి తదితరులు పాల్గొన్నారు.