-ఎట్టి పరిస్థితుల్లో మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి: ఆం.ప్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోని పలు జిల్లాల్లో బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వలన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలు జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుని మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. సమాచార శాఖ, మీడియా, సోషల్ మీడియా తదితర మార్గాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని సూచించగా, తిరుపతి జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ముందస్తుగా జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి అందరు అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాలలో పర్యటించి డ్రెయిన్లు ఎక్కడైనా బ్లాక్ అయిన వాటిని క్లియర్ చేయడం, జిల్లాలోని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్య కారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు కాలంగి, కండలేరు, కల్యాణి డ్యాం తదితర రిజర్వాయర్ ల నీటి నిలువ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు 25 శాతం వరకు మాత్రమే నిండి ఉన్నాయని తెలిపారు. గత 2021 సం. అనుభవాల దృష్ట్యా ఎక్కడ ఎక్కడ వరద ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు చేపడుతున్నామని, పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్ధంగా ఉన్నామని వివరించారు. గత మూడు రోజుల నుండి జిల్లాలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, కోస్తా తీర ప్రాంతాలైన గూడూరు డివిజన్ కోట, చిల్లకూరు, వాకాడు మండలాలు, సూళ్లూరుపేట డివిజన్ నందు తడ తదితర మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని, నిత్యావసర సరుకులు తగినంత అందుబాటులో అన్ని మండలాలలో ఉండేలా చర్యలు తీసుకున్నామని, చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను పరిశీలించారు అని, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఎలాంటి విపత్తును అయినా ఎదుర్కునేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలుపుతూ గౌ. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మార్గదర్శనం మేరకు ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు చేపడతామని తెలిపారు.