-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ నూతన మద్యం పాలసీ మద్యం షాపుల టెండర్లకు సంబంధించిన ఓపెన్ లాటరీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుండి తిరుచానూరు శిల్పారామం ఫంక్షన్ హాల్ నందు మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సంబంధిత ఎక్సైజ్ అధికారులతో కలిసి ప్రారంభించారు. మొత్తం 227 షాపులకు 3920 దరఖాస్తులు అందడం జరిగిందని వాటికి సంబంధించిన లాటరీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. సదరు ప్రక్రియ 227 మద్యం షాపులకు మధ్యాహ్నం వరకు పూర్తి అయిందని తెలిపారు. లాటరీ డిపోలో విజేతలుగా మద్యం షాపు దక్కించుకున్న వారు అక్టోబర్ 16 నుండి మద్యం షాపులను ప్రారంభించాల్సి ఉంటుందని, రేపు మద్యం డిపో నుండి స్టాక్ ను తీసుకెళ్లాల్సి ఉంటుందని సంబంధిత ఫీజును ఆరు విడతలుగా చెల్లించవచ్చని తెలిపారు. మొదటి విడత ఇన్స్టాల్మెంట్ ఈరోజు లేదా రేపు సాయంత్రం లోపు కట్టాల్సి ఉంటుందని తెలిపారు. లాటరీ ప్రక్రియ జరుగుతున్న ఫంక్షన్ హాల్ నందు లక్కీ విజేతగా మద్యం షాప్ దక్కించుకున్న వారు చలాన క్యాష్ డిపాజిట్ చేయుట కొరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కౌంటర్లు ఏర్పాటు చేశారని పలువురు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వర రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జెసి వారి సహకారంతో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను చక్కగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖకు సుమారు 78.40 కోట్లు రూపాయల రెవెన్యూ సమకూరిందని తెలిపారు. మద్యం దుకాణాలు ఈనెల 16 నుండి ప్రారంభించాలని, ఉదయం 10 గం.ల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మద్యం దుకాణాల లైసెన్స్ 2024 నుండి 30సెప్టెంబర్ 2026 వరకు చెల్లుబాటు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాసుదేవ చౌదరి, ఊహా శ్రీ, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.