Breaking News

భారత రక్షణ క్షిపణి రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి డా.సూరి భగవంతం

-డా.సూరి భగవంతం స్మారక కేంద్రాన్ని పెద్దఎత్తున నూజివీడులో ఏర్పాటు చేస్తాం:
-మన రాష్ట్రంలోని నాగాయలంకలో బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం – రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
-ఆగిరిపల్లిలో ఘనంగా జరిగిన డా. సూరి భగవంతం 115 జయంతి వేడుకలు- విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పార్థసారధి

అగిరిపల్లి/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రక్షణ క్షిపణీ రంగంలో ప్రపంచంలో మొదటి మూడు స్థానాలలో భారతదేశం నిలపడంలో డా. సూరి భగవంతం పాత్ర ఎంతో ప్రముఖమైనదని, అటువంటి వ్యక్తి మన ప్రాంతం వారు కావడం మనకెంతో గర్వకారణమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. శ్రీ శోభనాద్రి లక్ష్మీ నరసింహ వేద శాస్త్ర పాఠశాల ఆవరణలో డిఆర్డిఓ పూర్వపు డైరెక్టర్ జనరల్ మరియు రక్షణ శాఖా మంత్రి పూర్వ శాస్త్ర విజ్ఞాన సలహాదారు డా. సూరి భగవంతం 115వ జయంతి సందర్భంగా డా. సూరి భగవంతం కాంస్య విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ డా. జి. సతీష్ రెడ్డిలతో కలిసి మంత్రి పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దేశ రక్షణ శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచపటంలో భారత దేశం ప్రముఖ స్థానంలో నిలపడంతో భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం, డా. సూరి భగవంతం వంటి వారు వేసిన పునాదులేనన్నారు. 130 కోట్ల మంది భారతీయులు భయం లేకుండా జీవిస్తున్నామంటే ఇటువంటి మహనీయులు దేశరక్షణ కు చేసిన కృషే కారణమన్నారు. అటువంటి వారి జీవితాలను ప్రతీ ఒక్కరూ స్మరించుకునేలా వారి జీవిత విశేషాలు తెలియజేసే విధంగా నూజివీడులో డా. సూరి భగవంతం స్మారక కేంద్రాన్ని పెద్దస్థాయిలో ఏర్పాటు చేస్తానని, ఈ కేంద్రంలో డా. సూరి భగవంతం జీవిత చరిత్ర, వారు రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన విజయాలు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. వారి ఖ్యాతి దిగంతాలు వ్యాపించేలా చర్యలు తీసుకుంటానన్నారు. . శాస్త్ర సాంకేతిక రంగాలలో విశిష్ట కృషి చేసిన వారిని ప్రతీ సంవత్సరం ఎంపిక చేసి, డా. సూరి భగవంతం పేరుమీదుగా అవార్డు ప్రధానం చేసేందుకు ట్రస్ట్ నెలకొల్పాలన్నారు. ఇందుకు తాను 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేస్తున్నామని మంత్రి తెలియజేసారు. దేశ రక్షణలో ప్రధానపాత్ర వహించే బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, ఇందుకు కృషి చేసిన డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. శ్రీ శోభనాద్రి లక్ష్మీ నరసింహ వేద శాస్త్ర పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, పాఠశాల ప్రతినిధులు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మన తెలుగుజాతితో జన్మించిన మహానీయులను మనం గుర్తించి, వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. డా. సూరి భగవంతం నోబుల్ బహుమతి గ్రహీత డా. సి.వి. రామన్ ప్రియ శిష్యులని, బెంగుళూరు లోని టాటా ఏరోస్పేస్ రక్షణ సంస్థకు డా. సి. వి. రామన్ అనంతరం డైరెక్టర్ అయ్యారన్నారు. డా. సూరి భగవంతం నిర్వహించిన పదవులను వారి అనంతరం డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి నిర్వహించారన్నారు. నాగాయలంక కు రాకెట్ ప్రయోగ కేంద్రం ను కేంద్ర ప్రభుత్వం మంజూరుచేయడంలో డా. సతీష్ రెడ్డి పాత్ర ప్రధానమైనదని, ఈ కేంద్రం ఏర్పాటుతో కృష్ణా జిల్లా దశ, దిశ మారుతుందన్నారు.
డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ మరియు ఏరోనాటికల్ సొసైటీ అఫ్ ఇండియా చైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ డా. సూరి భగవంతం 1961లో 9 సంవత్సరంపాటు కేంద్ర రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారన్నారు. మన సరిహద్దుల్లో ఉన్న శత్రుదేశాల నుండి మన దేశానికీ ముప్పు వాటిల్లకుండా హిమాలయాల్లో, ఈశాన్య రాష్ట్రాలైన లెహ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రయోగశాలలను ఆరోజుల్లోనే ఏర్పాటు చేశారన్నారు. రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ముందు వరసలో నిలబెట్టిన ఘనత డా.సూరి భగవంతంకు దక్కుతుందన్నారు. ఆయన హయాంలో 25 ప్రయోగశాలలు ఏర్పాటుచేశారన్నారు. డా. సూరి భగవంతం ఎంతో ముందు చూపుతో దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకున్నారని, మన దేశం రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడంలో డా. సూరి భగవంతం పాత్ర ప్రముఖమైనదన్నారు. 2023-24 సంవత్సరంలో 24 వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేశామని, ఇందుకు డా. సూరి భగవంతం రక్షణ శాస్త్ర సాంకేతిక రంగంలో వేసిన బీజమే కారణమన్నారు.
అనంతరం డా.సూరి భగవంతం జీవిత చరిత్రపై ప్రచురించిన ” వైజ్ఞానిక క్రాంతికిరణం” బ్రోచర్ ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. సతీష్ రెడ్డిని, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తదితరులను మంత్రి సన్మానించారు.
అనంతరం డా. సతీష్ రెడ్డి మంత్రి కొలుసు పార్థసారధిని పూలమాల, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి వేద పాఠశాల ఆవరణలో గో పూజ చేశారు.
కార్యక్రమంలో డా.సూరి భగవంతం ఫౌండేషన్ ఫౌండర్ మరియు డైరెక్టర్ ఎస్. బి. రామ్, నేషనల్ బుక్ ట్రస్ట్ సభ్యులు జి. వల్లీశ్వర్, నూజివీడు ఆర్డీఓ వాణి , పంచాయతీ రాజ్ ఈ ఈ బాపురెడ్డి, వేద పాఠశాల కార్యవర్గ సభ్యులు సూరి శర్మ, సలాక రఘునాధ శర్మ, దోర్బల ప్రభాకర శర్మ, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *