-విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా
-దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించిందని, ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు.పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించిందని సిసోడియా వివరించారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఈ వాయుగుండం పయనిస్తుందని, అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించారు. ఏపీలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరోవైపు నైరుతి రుతుపవనాలు మంగళవారంతో దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయన్నారు. ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమైందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. మరోవైపు మంగళవారం విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనితకు సిసోడియా పరిస్థితిని వివరించారు. సిసోడియా అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్స్ కు అవసరమైన ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు.