Breaking News

శివారు ప్రాంతాలకు తాగునీరు అందించాలి

-నిర్ణీత సమయంలోగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
-అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించండి
-జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని శివారు గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు సక్రమంగా అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించి వివిధ ప్రభుత్వ శాఖల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, స్త్రీ సంక్షేమం రక్షణ, ప్లానింగ్ ఆర్థికం, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా అంశాలపై సభ్యులు సమస్యలను లేవనెత్తగా సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో రక్షిత మంచినీటి పథకాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, నీరు కలుషితం కాకుండా ఫిల్టర్ బెడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు సక్రమంగా శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల్లో నాచు తొలగింపు, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు ట్యాప్ లు పాడైపోయిన కుళాయిలకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, అందుకు నీటి నిల్వకు సరిపడ చెరువులు లేదా స్థలాలను గుర్తించి పనులను చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మంజూరైన గృహాలకు లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించి ప్రోత్సహించాలని, వచ్చే మార్చి కల్లా నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.

ఈ నేపథ్యంలో అవసరమైన లేఔట్లలో మెరక పనులు, రహదారుల నిర్మాణం, విద్యుత్, నీటి వసతి, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించి నిర్మాణాలకు అనుకూలంగా పరిస్థితులను కల్పించాలని సూచించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే పై ఎం ఎల్ హెచ్ పి లకు ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించామని, బెల్ కంపెనీ వారు దానం చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాల సహాయంతో వచ్చే నెలలో గ్రామాలలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నామని కృష్ణాజిల్లా వైద్యాధికారిణి డాక్టర్ జి గీతాబాయి జడ్పీ చైర్ పర్సన్ కు తెలిపారు.

అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంపులు నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని, అందుకు కృష్ణా జిల్లాకు ఉత్తమ అవార్డు లభించినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, సంభవించిన వరదలకు డ్రోన్లు, బోట్లు సహాయంతో అవసరమైన వారికి ఔషధాలను అందించామని, ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా సకాలంలో అవసరమైన చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ సుహాసిని వివరించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వైద్యాధికారులు, సిబ్బందిని జడ్పీ చైర్ పర్సన్ తో పాటు సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లా పరిషత్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, మొదలుపెట్టని పనులను పురోగతిలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు తమను అధికారులు ఆహ్వానించడం లేదని సభ్యులు జడ్పీ చైర్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ జిల్లాలో అధికారికంగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేదా కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించి తీరాలని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు అందాయని, ఇకపై దీనిని అతిక్రమించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, పలువురు జడ్పిటిసి సభ్యులు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *