– నాణ్యమైన మొక్కలు, పంట యాజమాన్యంతో అధిక దిగుబడులు
– ఆధునిక సాంకేతికత తోడుగా పంట కోత అనంతర జాగ్రత్తలతో రైతులకు మేలు
– విలువ జోడింపు ఉత్పత్తులు దిశగా కూడా అడుగులేయాలి
– ఏపీ కోకో బీన్స్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమైన ఘనా బీన్స్‌తో సమాన నాణ్యత
– రాష్ట్రంలో ఏటా అయిదు వేల హెక్టార్లలో కోకో విస్తరణకు ప్రణాళికల రూపకల్పన
– కోకోపై అంతర్రాష్ట్ర భాగస్వామ్య పక్షాల మేధోమథన సదస్సులో ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోకో సాగులో సవాళ్లను అధిగమించి, అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయంతో రైతులకు మేలు జరిగేందుకు సమష్టి కృషి అవసరమని వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు, అధికారులు ఉద్ఘాటించారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో కోచి కేంద్రంగా పనిచేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ క్యాష్యూ నట్ అండ్ కోకో డెవలప్‌మెంట్(డీసీసీడీ), ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సంయుక్తంగా బుధవారం విజయవాడలోని హోటల్ పార్క్ ఎన్‌లో కోకో పంటపై భాగస్వామ్య పక్షాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో డీసీసీడీ డైరెక్టర్ డా. ఫెమీనా, ఏపీ ఉద్యాన శాఖ డైరెక్టర్ డా. కె.శ్రీనివాసులుతో పాటు రైతులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు, మార్కెటింగ్ ఏజెన్సీలు, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొని కోకోకు సంబంధించి విత్తు నుంచి విక్రయం వరకు ఎదురవుతున్న సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నాణ్యమైన మొక్కల ఉత్పత్తి (హైబ్రిడ్లు, క్రోన్లు), పంట ఉత్పత్తి డిమాండ్, సరఫరా సమస్యలు, నాణ్యమైన బీన్స్ ఉత్పత్తి, విలువ జోడింపు, పంట కోత అనంతర నిర్వహణ, కోకో అభివృద్ధికి సమగ్ర వ్యూహాలు తదితరాలపై మేధోమథనం జరిపారు.
సదస్సులో ఏపీ ఉద్యాన శాఖ డైరెక్టర్ డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయరాయిలో అధిక నాణ్యతగల మొక్కల ఉత్పత్తికి కోకో క్లోనల్ ఆర్చర్డ్ ఏర్పాటుచేసినట్లు వివరించారు. కోకో సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ఉద్యాన శాఖ, డా. వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీతో కలిసి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కోకో పంట విస్తరణకు, బీన్స్ ఆరబోత, ఫెర్మెంటేషన్ ప్యాక్ హౌస్‌లు, చాక్లెట్ల ఉత్పత్తికి కోకో ఫౌడర్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ఉద్యానశాఖ రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రధాన కోకో ఉత్పత్తి రాష్ట్రంగా ఉందని.. 30,552 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ 12,135 మెట్రిక్ టన్నుల డ్రైడ్ బీన్స్ వార్షిక దిగుబడి నమోదవుతోందని వివరించారు. ముఖ్యంగా ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కోనసీమ, కాకినాడ, కృష్ణా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కోకోను రైతులు సాగుచేస్తున్నారన్నారు. విస్తీర్ణం, ఉత్పాదకత పరంగా ఏలూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏటా 5 వేల హెక్టార్లలో కోకో పంట విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న కోకో బీన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైన ఘనా బీన్స్‌తో సమానంగా నాణ్యతను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. కోకో అంతరపంటతో రైతులకు రూ. 75 వేల మేర అదనపు ఆదాయంతో పాటు ప్రధాన పంట ఉత్పాదకత కూడా పెరుగుతోందని వివరించారు.
రైతుల నైపుణ్యాలను మెరుగుపరచడం, అధిక నాణ్యత గల కోకో బీన్స్ ఉత్పత్తికి చేయూతనందించడం, పంట దశనుబట్టి విస్తరణ కార్యక్రమాలు నిర్వహించడంపైనా ప్రత్యేక దృష్టి అవసరమని వక్తలు స్పష్టం చేశారు. నర్సరీల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల నిర్వహణ, గ్రాఫ్టింగ్ టెక్నిక్స్, ఆర్టిఫీషియల్ పరాగ సంపర్కం, కొబ్బరి, ఆయిల్‌పామ్‌తో పాటు జీడితోటల్లోనూ కోకో సాగుకు అనుకూల పరిస్థితులు తదితరాలపైనా డీసీసీడీ డైరెక్టర్ డా. ఫెమీనా ఆధ్వర్యంలో విలువైన చర్చ జరిగింది.
సమావేశంలో రాష్ట్ర ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, హరినాథ్‌రెడ్డి, సహాయ సంచాలకులు సుధ, ఐకార్ సైంటిస్ట్ డా. ఎస్. ఎలైన్ అఫ్సారా, డా. వైఎస్ఆర్‌హెచ్‌యూ రీసెర్చ్ డైరెక్టర్ డా. ఎం.మాధవి, మాండలీజ్ ఇండియా ఫుడ్స్ ఫ్రైవేట్ లిమిటెడ్ కోకో ఆపరేషన్స్ మేనేజర్ రాజేష్ రామచంద్రన్, క్యాంప్కో లిమిటెడ్ (మంగళూరు) ఎండీ డా. బీవీ సత్యనారాయణ, కోకో ట్రెయిట్ (చెన్నై) నితిన్ చోర్డియా, ఎన్‌టీఆర్ జిల్లా ఉద్యాన అధికారి డా. పి.బాలాజీ కుమార్ తదితరులు హాజరయ్యారు.