Breaking News

కేడీసీసీ బ్యాంకుకు ఎంతో ఘన చరిత్ర, మంచి పేరు ఉంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేడీసీసీ బ్యాంకుకు ఎంతో ఘన చరిత్ర, మంచి పేరు ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన మోపిదేవిలో 1.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన భవనాన్ని మంత్రివర్యులు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మేనేజరు, స్ట్రాంగ్, రికార్డు గదులను వారు ప్రారంభించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915 వ సంవత్సరంలో రైతుల భాగస్వామ్యంతో కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ను ఏర్పాటు చేశారన్నారు. అలాగే వారి చొరవతో ఆంధ్ర బ్యాంకు, ఎల్ఐసి ఏర్పాటు కాబడ్డాయన్నారు. ఈ కేడీసీసీ బ్యాంకుకు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో 57 శాఖలు కలిగి 531 సొసైటీలు అనుసంధానమై ఉన్నాయన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా కేడీసీసీ బ్యాంకు అన్ని విధాల అండగా ఉండి ఆదుకోవడంలో మంచి గుర్తింపు తెచ్చుకుందన్నారు.

ఈ బ్యాంకు గొప్పగా సేవలు అందిస్తుందని, పంట రుణాలు, బంగారు రుణాలు, పిల్లల చదువుకు రుణాలు అందించడంతోపాటు ఏటీఎంలు కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. జాతీయ బ్యాంకుల తరహాలో కేడీసీసీ బ్యాంకు నడుస్తోందని, మంచిగా లాకర్లు, కౌంటర్లు ఏర్పాటు చేశారని మరింత మెరుగ్గా రైతులకు, వినియోగదారులకు సేవలు అందించి అభివృద్ధి చెందాలన్నారు. సహకార రంగానికి ఆర్థికంగా బలోపేతం చేయడంలో తన వంతు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తమ బ్యాంకు పురస్కారం కూడా అందుకుందన్నారు. ఈ బ్యాంకులో పెద్ద ఎత్తున 3,200 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయన్నారు. ఇటీవలి కృష్ణ నది వరదల సందర్భంగా 20 లక్షల రూపాయలను బ్యాంకు యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి( సీఎంఆర్ఎఫ్) అందించిందన్నారు. గత 5 ఏళ్లుగా సహకార వ్యవస్థ నిర్వీరమైపోయిందన్నారు. ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం తిరిగి నిలబెట్టడానికి అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. సహకార సంఘాలు, బ్యాంకుల నిర్వహణకు త్వరలో పాలకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. తద్వారా రైతాంగానికి ఎంతో మేలు జరగనుందన్నారు.

అంతకుమునుపు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య అమృత హస్తాలతో సహకార రంగంలో కేడీసీసీ బ్యాంకు తదుపరి ఆంధ్ర బ్యాంకు ప్రారంభించారన్నారు. ఆ బ్యాంకులు అత్యద్భుతంగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయన్నారు.
కార్యక్రమేనా ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనమైందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు కేడీసీసీ బ్యాంకు రాష్ట్రంలోనే ఎప్పుడు లాభాల బాటలోనే నడుస్తుందన్నారు. కేడీసీసీ బ్యాంకు సేవలందించడంలో ఎప్పుడు అగ్రగామిగా ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని, ఆప్కాబ్ అధ్యక్షులుగా ఎప్పుడు కృష్ణా జిల్లా వారినే నియమించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో మోపిదేవిలో కేడీసీసీ నూతన భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్యాంకు రైతాంగానికి అన్ని విధాల సహకారం అందించి అండగా నిలవాలని కోరుతున్నానన్నారు. కూటమి ప్రభుత్వం సహకార వ్యవస్థను పరిపుష్టం చేయడానికి పూనుకుందన్నారు. కేడీసీసీ బ్యాంకు అద్వితీయమైన బ్యాంకుగా గుర్తింపు పొందాలని, భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటున్నానన్నారు.

ఈ సందర్భంగా మంత్రి, శాసనసభ్యులు, బ్యాంకు చైర్మన్ లకు బ్యాంకు సీఈవో జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కే డి సి సి బ్యాంకు సీఈవో ఏ శ్యామ్ మనోహర్, జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, ఏజీఎం జి సూర్య ప్రకాష్ రావు, బ్రాంచ్ మేనేజర్ సయ్యద్ సల్మా సుల్తానా, తహసీల్దారు శ్రీవిద్య, జడ్పిటిసి మెడబలిమీ మల్లికార్జున రావు, ఎంపీపీ రావి దుర్గ వాణి,ఎంపీటీసీ కొమ్మ పవన్ కుమార్, సర్పంచ్ నందిగం వేద రాణి, పలువురు బ్యాంకు ఉద్యోగులు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *