తాడిగడప (పెనమలూరు), నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులందరూ సమిష్టిగా పనిచేస్తూ తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఉదయం పెనమలూరు మండలం, తాడిగడపలోని బందరు రోడ్డు ప్రధాన రహదారి పక్కన ఉన్న ద్వారక హోటల్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ పెనమలూరు నియోజకవర్గ శాసన సభ్యులు బోడే ప్రసాద్ తో కలసి తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన సమస్యలను కలెక్టర్ కు వివరించారు. మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, దీనికి తోడు పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణకు 328 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా పనులు సజావుగా సాగేందుకు అదనంగా మరో 75 మంది సిబ్బందిని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అందుకు తగిన ఫైల్ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.
అదేవిధంగా ప్రస్తుత కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు చేయాలని, హౌస్ హోల్డ్ అసెస్మెంట్ రూపొందించడానికి కొన్ని రోజులపాటు సచివాలయ ఉద్యోగులను కేటాయించాలని శాసనసభ్యులు కోరారు. మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదని, మున్సిపాలిటీ అభివృద్ధికి సరైన ఆదాయ వనరులు లేవని, ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి, నీటి, ఆస్తి పన్నులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త అంచనాలు తయారు చేసేందుకు సచివాలయ సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఆదాయ వనరులను బలోపేతం చేసుకునేందుకు అధికారులు, సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. పన్నుల విషయంలో డీఫాల్టర్లను గుర్తించి ప్రతి ఒక్కరి నుంచి అన్ని పన్నులు వసూలు చేయాలన్నారు. వారు చెల్లించే పన్నులను తిరిగి మున్సిపాలిటీ అభివృద్ధికే ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేసి సకాలంలో పన్నులు చెల్లించే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు.
బందరు రోడ్డు ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీని సక్రమంగా నిర్మించాలని, అందుకు అవసరమైన అంచనాలను రూపొందించి సమర్పించాలని జాతీయ రహదారుల అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి సూచించారు. అనధికారిక లేఅవుట్లపై దృష్టి సారించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఏర్పాటు చేస్తే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
బహిరంగం లేదా ప్రైవేట్ స్థలాల్లో చెత్త వేసే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి చర్యలు తీసుకోవాలని, చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పారిశుధ్యంపై వారి ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం పారిశుద్ధ్య సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం ఆయన స్థానిక శాసనసభ్యులతో కలిసి తులసీ నగర్, కానూరు వృద్ధుల ఆశ్రమం రోడ్డులోని డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కార్యక్రమంలో ముందుగా ఆయన గురువారం వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకొని స్థానిక శాసన సభ్యులతో కలిసి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ అధికారి బిఎస్ హేలా షారోన్, తాడిగడప మునిసిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్, తహసిల్దార్ గోపాల్ కృష్ణ, స్థానిక నాయకులు అనుమోలు ప్రభాకర్, ఇతర అధికారులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.