–ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తి దాయకం: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాల్మీకి మహర్షి ఆదికవి, మహాకవి మహనీయులు అని, వారి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తి దాయకం అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా, జెసి శుభం బన్సల్ తో కలిసి పాల్గొని వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని, అలాంటి మహనీయులు మన వాల్మీకి మహర్షి అని వారి జీవితాన్ని మనం ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచేలా వారి స్పూర్తిని మనం స్మరించుకునే దానిలో భాగంగా వాల్మీకి జయంతిని మనం రాష్ట్ర పండుగ గా జరుపుకుంటున్నామని అన్నారు. యువత మహర్షి వాల్మీకి స్పూర్తితో తమ జీవిత లక్ష్యాలను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలి అన్నారు. మొట్ట మొదటి శ్లోకం మనకు అందించిన మహర్షి మన వాల్మీకి అని కొనియాడారు. వారు తన చుట్టూ పుట్ట పెరిగినా తన దీక్షను, తపస్సును విడువకుండా పూర్తి చేసిన మహానుభావుడు అందుకే వారు వాల్మీకి మహర్షి అయ్యారని తెలిపారు. యువత అందరూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దైనందిన జీవితంలో స్పూర్తితో జీవించాలని పిలుపునిచ్చారు. అందరికీ అనుసరణీయం అయిన రామాయణం రచించిన ఆది కవి మన వాల్మీకి మహర్షి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార అధికారి చంద్ర శేఖర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, తదితర జిల్లా అధికారులు, ఎబిసిడబ్ల్యుఓ జ్యోత్స్న, బిసి సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.