-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. డోర్ టూ డోర్ కలెక్షన్ లేక కాలనీలలో రోజురోజుకి పరిస్థితి దయనీయంగా మారుతోందన్నారు. సెంట్రల్లో ముఖ్యంగా వాంబేకాలనీ, న్యూఆర్ఆర్ పేట, ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. చిన్న సందులోనే దాదాపు ఐదారు చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయన్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కాలనీల్లోని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సర్కిల్ – 2 కి సంబంధించి ఒక ఏఎంహెచ్ఓ, ఇద్దరు సూపర్ వైజర్లు, 20 మంది శానిటరీ ఇన్స్ పెక్టర్లు, 96 మంది శానిటరీ సెక్రటరీలు, 1,200 మంది వర్కర్లు ఉన్నప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 11 వేల కమర్షియల్, 80 వేల రెసిడెన్షియల్ కనెక్షన్లు ఉండగా.. వారం రోజులుగా చెత్త సేకరణ వాహనాలు కనిపించకపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో.. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో శానిటేషన్ కు రూ. 52 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పటమే తప్ప.. పలుచోట్ల నేటికీ పరిస్థితి అస్తవ్యస్థంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. మరోవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచిన కూటమి ప్రభుత్వం.. చెత్త పన్ను రద్దు చేశామని ఆర్భాటంగా చెప్పుకోవడం హాస్యాస్పదమని మల్లాది విష్ణు అన్నారు. మురుగుకాల్వలు వాడుతున్నందుకు 2002లోనే పల్లెల్లో చంద్రబాబు పన్ను వసూలు చేశారని గుర్తుచేశారు. అలాగే 2016 లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోను చెత్త సేకరణకు ఫీజు విధించి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. అయినా చెత్తను జనావాసాల మధ్యే డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి పారేశారని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 243 గ్రార్భేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దినట్లు వివరించారు. ఒక్క సెంట్రల్లోనే 90 ఆటోలను కొనుగోలు చేసి.. రోజుకీ 200 టన్నుల చెత్తను తరలించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 25 వేల టన్నుల చెత్తను ఈ ప్రాంతం నుంచి తరలించి.. ఎక్సెల్ ప్లాంట్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ‘నాడు’ వైసీపీ హయాంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు వరుసగా మూడేళ్ల పాటు కేంద్రం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని.. కానీ ‘నేడు’ ప్రభుత్వ చేతగానితనం వల్ల నగరం చెత్తనగరంగా మిగిలిపోయిందన్నారు. ఈ 4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. పరిస్థితి మరీ దారుణంగా మారే ప్రమాదం ఉందని మల్లాది విష్ణు అన్నారు. కనుక అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. పారిశుద్ధ్యం మెరుగుపరచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాలువల్లో పూడికతీత ఎప్పటికప్పుడు తొలగించాలని, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News