మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చ్చాంబర్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి ప్రమాదాలు, నివారణ తదితర అంశాలపై సమీక్షించారు.
తొలుత జిల్లా రవాణా అధికారి జి మనీషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత మూడు సంవత్సరాల్లో జరిగిన రహదారి ప్రమాదాలను కలెక్టర్ కు వివరించారు. ఈ సంవత్సరం 569 ప్రమాదాలు జరగగా, అందులో 242 మంది చనిపోయారని, 541 మందికి గాయాలయ్యాయన్నారు. నెలకు సరాసరి 26 మంది చనిపోయారన్నారు. ఆగస్టు నెలలో 69 ప్రమాదాలు జరగగా అందులో 32 మంది చనిపోయారని, 55 మంది గాయాలపాలయ్యారన్నారు. సెప్టెంబరు మాసంలో 53 ప్రమాదాలు సంభవించగా 23 మంది చనిపోయారని, 46 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ సంవత్సరం జనవరిలో అత్యధికంగా 83 ప్రమాదాలు జరగగా, సెప్టెంబర్ లో తక్కువగా 53 ప్రమాదాలు జరిగాయన్నారు. జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా ప్రమాదాలు పరిశీలించి 61 బ్లాక్ స్పాట్లు గుర్తించడం జరిగిందన్నారు. అందులో అత్యధికంగా ఎన్ హెచ్ 65 మచిలీపట్నం-ఆటోనగర్ విజయవాడ జాతీయ రహదారిలో 30 బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. అలాగే ఎన్ హెచ్ 16 గూడవల్లి-బొమ్మలూరు జాతీయ రహదారిలో 20 బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. ప్రధానంగా పెనమలూరులో 11 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా 129 ప్రమాదాలు జరిగాయని, సెప్టెంబర్ మాసంలో 15 ప్రమాదాలు జరిగాయన్నారు. ఆ సమయంలోనే ఎందుకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ ప్రశ్నించారు. పెనమలూరు ఎంవిఐ టీవీఎన్ సుబ్బారావు మాట్లాడుతూ ఆ సమయంలో రాకపోకలు చాలా రద్దీగా ఉంటుందని పెనమలూరు, కానూరు లో అండర్ పాస్ గాని, సిగ్నల్ సిస్టం గాని లేదని, అందువలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అయితే చనిపోవడం జరగలేదని గాయాలు అవుతున్నాయని కలెక్టర్కు వివరించారు.
అక్కడ వున్న కళాశాల వద్ద ఫ్లైఓవర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు నివారించేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి ప్రాజెక్టు, పోలీసు, రవాణా శాఖల ప్రతినిధి బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా రహదారి వెంబడి పర్యటించి డివైడర్లను ఎక్కడేక్కడ చిన్న చిన్న గండ్లు కొట్టారో గుర్తించి వాటిని మూసివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు
కొన్ని రహదారుల్లో వర్షపు నీరు నిల్వ ఉండి ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా అక్కడ ఇనుప కమ్మీలతో గ్రిల్స్ వేసి క్రింద నీరు పోయేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఆ జాబితాను వచ్చే సమావేశానికి తీసుకుని రావాలన్నారు. జిల్లాలో 75 హిట్ రన్ను కేసులు నమోదయ్యాయని అందులో 9 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ముంబై వారికి చెల్లింపు నిమిత్తం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అలాగే మరో 10 కేసుల సంబంధించిన ప్రతిపాదనలు ఈరోజు శుక్రవారం పంపడం జరుగుతుందన్నారు. మరో 17 కేసులు సిద్ధమయ్యాయన్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద రహదారిలో విద్యుత్ దీపాలు వెలగడం లేదని ఆ మార్గంలో ప్రముఖులు ప్రయాణిస్తున్నందున వెంటనే దీపాలు వెలిగేలా చూడాలన్నారు. రహదారి మార్గంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రార్ధన మందిరాలు వచ్చే చోట సూచిక బోర్డులు ఏర్పాటుకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. జాతీయ రహదారిలో గ్రామాలు ఉన్నచోట ప్రజలు దాటుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని అక్కడ ముళ్లపొదలను తొలగించడంతోపాటు క్రాసింగ్ వద్ద డివైడర్ను బ్లాక్ చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఏ ఆర్ ఎస్పీ ఎస్ వి డి ప్రసాద్,జాతీయ రహదారి పీడీ శ్రీధర్ రెడ్డి, డి పి టి ఓ శ్రీవాణి, డీఎస్ఓ పార్వతి, ఆర్ అండ్ బి ఈ లోకేష్,మచిలీపట్నం ఉయ్యూరు గుడివాడ తాడిగడప మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, భవానీ ప్రసాద్ ,డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రావణ కుమార్, ఎంవిఐ లు టివిఎన్ సుబ్బారావు, సిద్ధిఖ్ తదితర అధికారులు పాల్గొన్నారు.