మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామికవేత్తలకు కృష్ణాజిల్లా అనుకూలమైన ప్రాంతమని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పియంఈపిజిపి), పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధి నిమిత్తం నూతన పాలసీపై రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల చర్చించిందని, త్వరలో అందుకు సంబంధించిన నిర్ణయం రాబోతుందని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక వాడలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, సింగిల్ విండో పద్ధతిపై పరిశ్రమల ఏర్పాటు, రాయితీలు కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గత ఐదు సంవత్సరాలలో మంజూరు చేసిన ఆయా యూనిట్ల స్థితిగతులను పరిశీలించాలని, అవి కొనసాగుతున్నాయా లేదా, రుణ చెల్లింపులు చేశారా లేదా అన్న విషయాలపై నివేదిక సమర్పించాలని జిల్లా పరిశ్రమల మేనేజర్ కు సూచించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి మొదటి దశలోని దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల ఎంపికకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు.
పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద అర్హులైన కమ్మరి, మంగలి, దర్జీ, రోల్డ్ గోల్డ్, పూలదండల తయారీ వంటి రంగాలకు చెందిన పదిమంది లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను కలెక్టర్ అందజేశారు. మంజూరు చేసిన రుణాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ఆర్ వెంకట్రావు, ఎల్ డి ఎం జయవర్ధన్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బాబ్జి, డీపీఓ జె అరుణ, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.