మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక (ఎమ్మెస్ ఎం ఈ) రంగంతో పాటు విద్య, గృహ నిర్మాణ రంగాలకు బ్యాంకులు ఇతోదికంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత జిల్లాగా గత డిసిసి సమావేశంలో ప్రకటించిన విషయం కలెక్టర్ గుర్తుచేస్తూ, రుణాలు మరో ఏడాది పాటు రిస్ట్రక్చరింగ్ చేయాలని జారీ చేసిన ఆర్.బి.ఐ. సర్కులర్ నిబంధనలు అన్ని బ్యాంకులు అమలు చేయాలని అన్నారు.
రివర్స్ మార్ట్ గేజ్ స్కీం అమలు కావడం లేదని సీనియర్ సిటిజన్స్ నుండి ఫిర్యాదులు వచ్చాయని, బ్యాంకులు ఈ విధానం అమలు చేయాలన్నారు. ఎమ్మెస్ ఎం ఇ క్రింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇతోదికంగా రుణాలు మంజూరు చేయాలని, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం కింద వివిధ బ్యాంకుల వద్ద పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని, వివిధ బ్యాంకులు విద్యా రుణాల పంపిణీ కలెక్టర్ సమీక్షిస్తూ పెండింగ్ క్లియర్ చేసి, ఇతోదికంగా రుణాలు ఇవ్వాలన్నారు.
టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరు సమీక్షిస్తూ జిల్లాలో 356 కోట్ల రూపాయల రుణాలు అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 237 కోట్ల రూపాయల రుణాలు అందించారని, పెండింగ్ రుణాలు సత్వరమే అందించాలన్నారు. ఆక్వా రైతులకు రుణాల పంపిణీ సంబంధించి, దరఖాస్తు చేసిన వారికి కేడిసిసి బ్యాంక్ వద్ద 80 శాతం పెండింగ్ ఉన్నాయని, రుణాల మంజూరు వేగవంతం చేయాలన్నారు. వివిధ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు సాధించుటకు కృషి చేయాలని బ్యాంకులకు సూచించారు.
ఈ సమావేశంలో ఎల్డిఎం జయవర్ధన్, ఆర్బిఐ మేనేజర్ ఎంకే సునీల్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం రాజేష్, యూనియన్ బ్యాంక్ ఉప ప్రాంతీయ నిర్వహణ అధికారి తాతాజీ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. పద్మావతి, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ఆర్ .వెంకట్రావు, టిడ్కో పిడి బి. చిన్నోడు, ఉద్యాన శాఖ అధికారి జే జ్యోతి, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.