మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నిర్ణీత సమయానికి మచిలీపట్నం పోర్టు సిద్ధం చేసేందుకు అందుకు సంబంధించిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత అంశమని, డిసెంబర్ 2025 నాటికి పూర్తిచేసేలా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన ఇసుక కోసం ప్రత్యేక రీచ్ ను కేటాయించాలని, అదేవిధంగా మచిలీపట్నం వైద్య కళాశాల నిర్మాణం, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, ఇళ్ల నిర్మాణాలు తదితర ప్రభుత్వ పనుల అవసరాల కోసం మరొక ప్రత్యేక ఇసుక రీచ్ ను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఏ ఏ పనులు ఏ సమయానికి పూర్తి చేసేది, అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని పోర్టు అధికారులకు సూచించారు. ఈ క్రమంలో ఆయన పోర్టు నిర్మాణ పనులకు సంబంధించిన డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్ నిర్మాణం తదితర పనులపై ఆరా తీయగా, మొత్తం మీద 27 శాతం పోర్టు పనులు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.
భూసేకరణ సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యాయని, అసైన్డ్ భూములకు సంబంధించిన పరిహారం వాస్తవ భూయజమానులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజ్, రైతులకు పరిహారం చెల్లింపు, కాలనీలకు అప్రోచ్ రహదారులు, కాలువపై వంతెన నిర్మాణం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ కే చంద్రశేఖరరావు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ డీఈఈ ఎం శివయ్య, ఈఈ పల్లారావు, రైట్స్ టీం లీడర్ అధికారులు, బందరు, గుడివాడ ఆర్డిఓలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, తహసిల్దార్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.