మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మనబడి-మన భవిష్యత్తు కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ అధికారులతో మనబడి మన భవిష్యత్తు పురోగతిపై సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కింద రెండవ దశలో 488 పాఠశాలల్లో 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. అందులో నీటి సదుపాయంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి 31 1 పనులు మంజూరు కాగా 223 పనులు పూర్తయి, మిగిలిన 88 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కిచెన్ షెడ్లు 238 మంజూరు కాగా 155 పూర్తి అయ్యి 83 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. తరగతి గదులు మరుగుదొడ్ల మరమ్మతులకు సంబంధించి 580 పనులకు గాను 414 పూర్తికాగా 166 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి 311 పనులు మంజూరు కాగా 199 పనులు పూర్తయి 112 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదనపు తరగతి గదులు 104 పనులు మంజూరు కాగా 40 పనులుపూర్తయి 64 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో రెండో దశ కింద పి ఎం శ్రీ పథకం కింద రెండు పాఠశాలలు మంజూరయ్యాయని వాటికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టుటకు ఉన్నతాధికారుల నుండి పరిపాలన ఆమోదం పొందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యాంజలి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాలలను పోర్టల్ లో నమోదు చేయించి నాణ్యత గల విద్యావ్యాప్తికి ప్రోత్సాహాన్ని అందించాలన్నారు.
ఈ సమావేశంలో డిఇఓ తహేరా సుల్తానా, సర్వ శిక్ష ఏపీసి శ్రీరాముల నాయక్, జడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, సర్వ శిక్ష ఈ ఈ ఎన్.రాయన్న, డి ఈ డి ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.