గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో సమస్యలు, పరిష్కార మార్గాలపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలని, కార్యదర్శులు స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ ఎన్.జి.ఓ.కాలనీ, నల్లకుంట, శ్యామలా నగర్, పలకలూరు రోడ్, ఉద్యోగ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఎన్.జి.ఓ కాలనీ మున్సిపల్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైన్లను పరిశీలించి సంబందిత సచివాలయ శానిటేషన్, ఎమినిటి కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేసి, స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజు ఉదయం ఇంటింటి చెత్త సేకరణ చేస్తారని, వారితో సచివాలయం పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్ ద్వారా కాల్వలు శుభ్రం చేయించడంలో కార్యదర్శులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సచివాలయం పరిధిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కరించడం, సమస్య తీవ్రత అధికంగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి కార్యదర్శులు తీసుకురావాలన్నారు. అలాగే నగరంలో డ్రైన్ నిర్మాణం అనంతరమే రోడ్లు నిర్మాణం చేయాలని, నూతనంగా నిర్మాణం చేసే రోడ్లు తప్పనిసరిగా డ్రైన్ టు డ్రైన్ ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. నూతన డ్రైన్, రోడ్లు నిర్మాణ సమయాల్లోనే ఆక్రమణలు తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల మధ్యలో ఖాళీ స్థలాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆయా స్థల యజమానుల వివరాలు తెలుసుకొని, శుభ్రం చేసుకోవాలని, లేకుంటే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని నోటీసులు ఇవ్వాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
అనంతరం పెద్దపలకలూరు రోడ్ లోని రిజర్వాయర్, వాల్వ్ పిట్ లను పరిశీలించి, వాల్వ్ పిట్ లు లో లెవల్ లో ఉండడం వలన మురుగు నీరు కలిసే ప్రమాదం ఉందని తక్షణం వాటిని లెవల్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ. నాగ మల్లేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, కార్పొరేటర్ వి.శ్రీరామ్ ప్రసాద్, డిఈఈలు మధుసూదన్, నాగభూషణం, ఏసిపి వెంకటేశ్వర్లు, ఎంహెచ్ఓ ఆనందకుమార్, టిపిఎస్ లక్ష్మణ స్వామి, ఏఈలు నాగవేణి, చైతన్య, శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …