-పున్నమీ ఘాట్ వద్ద డ్రోన్ షో
-ఏర్పాట్లు పరిశీలించిన డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కెన్వెన్షన్ లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పున్నమీ ఘాట్ వద్ద నిర్వహించే డ్రోన్ షోకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నిధి మీనా, విజయవాడ నగర పోలీసు కమీషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యానచంద్ర తదితర ఉన్నతాధికారులతో కలిసి పున్నమీఘాట్‌లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి చర్చించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతోపాటు మంత్రులు, వీవీఐపీలు, ఈ డ్రోన్ షో తిలకించడానికి వస్తుండటంతో భద్రత ఏర్పాట్లు ఎలా చేయాలి, ఎవరెవరికి ఏఏ ప్రాంతాల్లో ఈ షో తిలకించేలా ఏర్పాట్లు చేయాలి అనే దానిపైన అధికారులు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ షో తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశమున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా, పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ పోలీసు అధికారులను కోరారు. డ్రోన్ షోతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షో కూడా ఉంటుంది కాబట్టి ఆయా కార్యక్రమాలు తిలికించడానికి ఇబ్బందులు లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. షో తిలకించడానికి వచ్చే ప్రజలకు మంచినీరు, తదితర సదుపాయాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వాహనాల పార్కింగు ఎక్కడ చేయాలి, ఏఏ వాహనాలను లోనికి అనుమతించాలి తదితర అంశాల గురించి అధికారులు చర్చించారు.