-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం
-సదస్సులో రెండు ఎంఓయూలపై సంతకాలు
-దేశానికి డ్రోన్స్ రాజధానిగా ఏపీ
-ముసాయిదా డ్రోన్ పాలసీ ఆవిష్కరణ
-22న సాయంత్రం పున్నమీ ఘాట్‌లో డ్రోన్ షో
-ప్రజలంతా తిలకించేలా విస్తృత ఏర్పాట్లు
-కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-రాష్ట్ర పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల పాటు నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సదస్సును విజయవంతం చేయాల్సింది ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి డ్రోన్ సమ్మట్ కు సంబంధించి చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. మంగళగిరి సీకే కన్వెన్షనులో ఈ సదస్సును ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు కూడా పాల్గొటారన్నారు. ఈ సదస్సుకు తాము ఊహలను మించి ప్రజల నుంచి, ఔత్సాహికుల నుంచి స్పందన వచ్చిందన్నారు. సదస్సులో పాల్గొనడానికి ఉత్సుకత ప్రదర్శిస్తూ 6,929 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని దేశానికి డ్రోన్ క్యాపిటల్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని, ఆయన ఆశయ సాధనకనుగుణంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో మొత్తం 9 సెషన్లు ఉంటాయన్నారు. నాలుగు కీలకోపన్యాసాలుంటాయని చెప్పారు. డ్రోన్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, ఈ రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిచేలా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. 20 నుంచి 24 రంగాల్లో డ్రోన్లను ఉపయోగించడానికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు.
2 ఎంఓయులు
ఈ సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటోందని చెప్పారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తిరుపతి ఐఐటీతో ఈ అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న ఎంఓయూ వల్ల ఏపీకి డ్రోన్ రిమోట్ పైలట్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో 20 వేల మందికి డ్రన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకన్నామన్నారు. అలాగే తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్టనర్‌గా చేసుకుంటూ మరో ఎంఓయూ కుదుర్చుకుంటున్నామని తెలిపారు.
50 ఎగ్జిబిట్స్
డ్రోన్ సదస్సులో భాగంగా సీకే కన్వెన్షన్ సెంటర్లో డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. 50 ఎగ్జిబిట్స్‌ని ఇందులో ప్రదర్శిస్తున్నామన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రదర్శనను ప్రజలందరూ, విద్యార్థులు, ఔత్సాహికులు అందరూ వచ్చి తిలకించవచ్చని తెలిపారు.
హ్యాక్‌థాన్ కు 520 మంది
ఈ సదస్సులో భాగంగా ఔత్సాహికుల కోసం డ్రోన్ హ్యాక్ థాన్ నిర్వహించామని ఇందులో 520 మంది పాల్గొన్నారని చెప్పారు. 9 థీమ్స్ లో పోటీని నాలుగు కేటగిరీలుగా వర్గీకరించామన్నారు. ముందుగా కేవలం ముగ్గురు విజేతలను మాత్రమే ఎంపిక చేయాలని అనుకున్నామని, అయితే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. దాంతో నాలుగు కేటగిరీల్లో ఒక్కో కేటగిరీలో ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తున్నామని, మొదటి బహుమతి రూ.3 లక్షలు, రెండో బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.1లక్ష ఇస్తున్నామని, 22వ తేదీ సాయంత్రం పున్నమీఘాట్‌లో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.
పున్నమీ ఘాట్‌లో డ్రోన్ షో
డ్రోన్ సమ్మిట్ లో భాగంగా మంగళవారం సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు పున్నమీ ఘాట్ వద్ద 5500 డ్రోన్లతో మెగా డ్రోన్ షో నిర్వహిస్తున్నామని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చని తెలిపారు. పున్నమీ ఘాట్ వద్ద 8 వేల మందికిపైగా కూర్చొని తిలకించే ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే నగరంలో పలు చోట్ల డిజిటల్ తెరలు ఏర్పాటు చేశామని వాటి ద్వారా డ్రోన్ షో, సదస్సును ప్రతక్ష ప్రసారం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన అందర్నీ విజ్ఞప్తి చేశారు.