-డ్రోన్ యూస్ కేసెస్ ఎన్ని చేపట్టగటమో ప్రణాళిక ఉండాలి
-ఏఏ ప్రభుత్వ విభాగాల్లో ఉపయోగించవ్చో పరిశీలించండి
-డ్రోన్, సీసీ కెమెరాలు, ఐఓటీ అనుసంధానం జరగాలి
-సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి
-డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రోన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి దిశా నిర్దేశం చేసేలా అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన డ్రోన్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ కు చేసిన ఏర్పాట్ల గురించి ప్రభుత్వ పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, డ్రోన్ కార్పొరషన్ ఎండీ కె. దినేష్ కుమార్‌లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ డ్రోన్ సమ్మిట్‌లో యువత, విద్యార్థులు ఎక్కువ మంది భాగస్వామ్యం వహించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. సీకే కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ను కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ఎక్కువ మంది తలికించే అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, కీలక ఉపన్యాసాల సారాంశం అన్నిటినీ క్రోడీకరించి ఏపీని డ్రోన్ రాజధానిగా చేయడానికి ఇవన్నీ ఎలా దోహదపడతాయనే దిశగా కసరత్తు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో డేటా అనేది గొప్ప సందని అన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఐఓటీ, వాట్సాప్‌ల ను అనుసంధానం చేసుకోవడం ద్వారా రియల్ టైమ్ లో సమస్యలను పర్యవేక్షించడమే కాకుండా రియల్ టైమ్‌లో పరిష్కారాలు కనుగొనవచ్చని చెప్పారు. డ్రోన్ల యూస్ కేసెస్ లో ఎన్నిటిని మనం ఉపయోగించుకోగలమనే దానిపైన ఒక అంచనా ఉండాలని, ప్రభుత్వంలో ఏఏ శాఖలు ఈ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశముంది, ఎన్నెన్ని యూస్ కేసెస్ ఉపయోగించుకోవచ్చు అనేదానిపైన ఒక స్పష్టత ఉండాలన్నారు. అవసరమైతే ప్రధానంగా డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశాలున్న శాఖల ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)తో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, డ్రోన్ల యూస్ కేసెస్‌లో ఏఐకి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆ దిశగా వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని దేశాలు డ్రోన్లను యుద్ధాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నాయని, మనం తద్భిన్నంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుందామన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. డ్రోన్ల ద్వారా ఇప్పుడు భూసార పరీక్షలు నిర్వహించవచ్చని, పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనావేయొచ్చని, ఎక్కడ పంటకు తెగులు సోకిందో ఇట్టే తెలుసుకుని, పంటంతా మందులు పిచికారి చేయకుండా కేవలం తెలుగు సోకిన ప్రాంతంలో మాత్రమే మందులు పిచికారి చేసి వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. అలాగే దోమల నివారణ, విద్యుత్తు లైన్ల పర్యవేక్షణ, రహదారుల పర్యవేక్షణ ఇలా పలు రంగాలు, పలు విధాలుగా డ్రోన్లను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.