-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపాలిటీలలో క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహనాలను నిలిపివేయడం సరికాదని.. ప్రభుత్వమే వాటిని నడపాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. చెత్త తరలించే వాహనాలు నిలిచిపోవడంతో నివాసాలలో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయి ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో క్లాప్ కార్యక్రమం ఎంతగానో విజయవంతమైందని.. విజయవాడ నగరానికి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సైతం వచ్చినట్లు గుర్తుచేశారు. అటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్యం విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో కాదని దుయ్యబట్టారు. ఫలితంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలోని నగరాలు, పట్టణాలలో పరిస్థితి దయనీయంగా మారిందని.. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయన్నారు. పైగా మారిన వాతావరణ పరిస్థితుల్లో నగరంలో జ్వరాలు విజృంభిస్తున్నాయని.. ప్రజలందరూ డయేరియా భయంతో వణికిపోతున్నారని చెప్పారు. విజయనగరంలో డయేరియా బారిన పడి 11 మంది మృత్యువాతపడినా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. చాలా చోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కిల్ – 2 పరిధిలో రోజుకీ దాదాపు 200 టన్నుల చెత్తను 90 వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆటోలు రాక చెత్త ఎక్కువ రోజులు ఇళ్లల్లోనే ఉండిపోతే.. మరిన్ని వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే క్లాప్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి.. వాహనాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.