మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటరుగా పేర్లను వచ్చే నవంబరు 6 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పిలుపునిచ్చారు. కృష్ణా గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో ఓటర్లుగా పేరు నమోదు చేసుకొనుటకు మచిలీపట్నం ఆర్డిఓ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ప్రత్యేక కేంద్రాన్ని సందర్శించి ఓటర్లుగా పేర్లు ఎలా నమోదు చేసుకోవాలని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు స్వయంగా ఫాం నెంబర్ 18 లో పూర్తి వివరాలు భర్తీ చేసి ఓటరుగా నమోదు చేసుకొనుటకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణ గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఇందుకోసం జిల్లాలో కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పట్టభద్రులైన ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఒక ఓటర్ల నమోదు కేంద్రాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేశామన్నారు.. ఈ ఓటర్ నమోదు కార్యక్రమం వచ్చే నవంబర్ నెల 6 వ తేదీ వరకు నడుస్తుందన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తు పత్రం ఫారం నెంబర్ 18 లో వివరాలు భర్తీ చేసి దానితో పాటు డిగ్రీ, డిప్లమో ధ్రువీకరణ పత్రం, ఆధార కార్డు ,ఓటర్ గుర్తింపు కార్డు ఫోటో స్టాట్ ప్రతులపై స్వయంగా సంతకం చేసి గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరణ పిదప పాస్పోర్ట్ ఫోటోతో సహా ఓటరు నమోదు కేంద్రాలైన అన్ని తహసిల్దార్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల కార్యాలయాల్లో అందజేయవచ్చన్నారు. జిల్లా అధికారులు వారి కార్యాలయంలోని పట్టభద్రులైన ఉద్యోగులందరికీ చేత ఓటర్లుగా నమోదు అలాగే అన్ని కళాశాలల్లో ఓటరు నమోదు పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ అవకాశం జిల్లాలోని పట్టభద్రులై మూడు సంవత్సరాలు దాటిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి. ఎస్ డి సి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి, డ్వామాపిడి శివప్రసాద్, డిఎస్ఓ పార్వతి, పౌర రసరఫరాల సంస్థ డిఎం సృజన, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జిల్లా ఉద్యాన అధికారి, జే జ్యోతి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, డీఈవో తహేరా సుల్తానా తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.