మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని సోమవారం స్థానిక పోలీస్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరుల స్తూపం వద్ద మంత్రి జిల్లా ఎస్పీ తో కలిసి పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ లేకపోతే నేటి సమాజంలో పరిస్థితిని ఊహించలేమని, విధి నిర్వహణలో అనేక కష్టనష్టాలకోర్చి 24 గంటలు ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు సోదరులకు అభినందనలు, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచి పోలీసింగ్ జరగాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది రాష్ట్ర పరువు దిగజార్చారని, పోలీసులు ధైర్యంగా తలెత్తుకొని నిలబడేలా చేయడం ప్రభుత్వ కర్తవ్యం అన్నారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ ప్రజల ధన,మాన, ప్రాణ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన మహనీయులు పోలీసులు అని కొనియాడారు. దేశవ్యాప్తంగా 2023- 24 సంవత్సరంలో 216 మంది పోలీసులు అమరవీరులయ్యారని, కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదిమంది అమరులైనట్లు తెలిపారు. రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 50 వేల రూపాయల నగదును కృష్ణాజిల్లా పోలీస్ సంక్షేమ నిధికి విరాళంగా అందించారు.
తొలుత మంత్రి, జిల్లా ఎస్పీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దివంగత పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జిల్లా పోలీస్ గ్రౌండ్స్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు పోలీసులు నిర్వహించిన ర్యాలీకి మంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లక్ష్మీ టాకీస్ వద్ద మానవహారం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక ప్రముఖ నాయకులు బండి రామకృష్ణ పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీగా పదోన్నతి పొందిన ఎస్ వి డి ప్రసాద్, డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, ఆర్టీవో కే. స్వాతి, తదితరులు పాల్గొన్నారు.