-ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆధునికీకరించిన 17 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.
-ఇప్పటికే విధులలో ఉన్న 17 వాహనాలకు అదనంగా GPS సిస్టం, సైరన్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ఫ్లాష్ లైట్, బ్రీత్ అనలైజర్, అత్యాధునిక టెక్నాలజీతో ఆధునికీకరించి పునః ప్రారంభం.
-తిరుపతి నగరాన్ని ఏడు సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్ కు ఈ వాహనాలు కేటాయింపు.
-పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వీరి పనితీరును పర్యవేక్షణ.
-నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారుల ఫోటో తీసి, జరిమానా విధించడమే వీరి లక్ష్యం.
-జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉదేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తిరుపతి నగరంలో ఇప్పటికే విధులలో ఉన్న 17 ద్విచక్ర వాహనాలకు అదనంగా GPS సిస్టం, సైరన్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ఫ్లాష్ లైట్, బ్రీత్ అనలైజర్ వంటి పరికరాలు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన వాటిని సోమవారం నాడు తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర ఐఏఎస్., , జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., వారు జెండా ఊపి పునః ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ వాహనాలన్నీ తిరుపతి ట్రాఫిక్ నియంత్రణ కోసం విధులలో ఉన్నాయని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికంగా తీర్చిదిద్ది, పునః ప్రారంభించామన్నారు.
తిరుపతి నగరాన్ని ఏడు సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ఈ వాహనాలను ట్రాఫిక్ పోలీసులను కేటాయించడం జరిగింది. వారు నిరంతరం తిరుగుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాహనాల ఫోటోలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి పంపించి, జరిమాణాలు విధించేటట్లు చేస్తారన్నారు.
తిరుపతి నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయుటకు ఏర్పాటు చేసిన వన్-వే లు, ఫుట్ పాత్ ఆక్రమణలు, రాంగ్ పార్కింగ్ లు వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తాయి. ప్రజల్లో పూర్తిస్థాయి చైతన్యం కల్పిస్తూ తిరుపతికి వచ్చే యాత్రికులకు, స్థానికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు.
ఈ వాహనాలన్నిటికీ కూడా GPS సిస్టం పెట్టి పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి వారి కదలికలపై కూడా నిరంతరం ఉన్నత అధికారులు నిఘా ఉంచడం జరుగుతుంది. అలాగే ఏదైనా అనుకోని ఘటనలు సంభవించినప్పుడు వారిని కంట్రోల్ రూమ్ ద్వారా అప్రమత్తం చేసి ప్రజలకు మంచి సేవలు అందిస్తామన్నారు.
ప్రజల్లో చైతన్యం ద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కూడా వీరు నిఘా పెడతారు. అవసరమైన సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్టులు నిర్వహించి, కోర్టులో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని, ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి, నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, శ్రీనివాసరావు సాయుధ దళం, ఎస్బి డిఎస్పి గిరిధర, తిరుపతి ట్రాఫిక్ సిఐ లు రవీంద్ర, సంజీవ్ కుమార్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.