ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవముగా ప్రారంభించబడినది. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు కనకదుర్గానగర్ మహామండపం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ విచ్చేయగా, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది తరపున స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ దంపతులు శ్రీ అమ్మవారికి ప్రధమ సారెను సమర్పించడముతో, శ్రీ అమ్మవారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభించడం జరిగినది. అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి, సుమారు రూ.3.30 లక్షల విలువజేయు బంగారు మయూరి హారమును శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కనుగుల వెంకటరమణ, ఎన్. సుజాత, కటకం శ్రీదేవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిట్టినగర్ లోని నగరాలు దేవాలయమునకు సంబంధించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి నుండి సంస్థ అధ్యక్షులు లింగిపిల్ల అప్పారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వారు కుటుంబ సభ్యులతో పాటు నగరాలు కులస్తులు సుమారు 200 మంది శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించుటకు విచ్చేసిన సందర్భంగా వారందరికీ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది.