Breaking News

వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి

-వన్యప్రాణుల వేట ఘటనలపై నివేదిక ఇవ్వాలి
-చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుతల వేటపై సమగ్ర విచారణ చేపట్టాలి
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై మంగళవారం సాయంత్రం అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకొన్నారు. చిరుతను చంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతపులి దాని గోళ్ల కోసం నాలుగు కాళ్లను విరిచేశారని, దాని దంతాలు కూడా తొలగించారని తెలుసుకొని ‘ఇది అమానవీయమైన, కలతపెట్టే నేరం. అత్యంత హేయమైన చర్య ఇది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కౌండిన్య అభయారణ్యం, తాళ్ళమడుగు అటవీ ప్రాంతంలో చిరుతల అనుమానాస్పద మరణాలపై పకడ్బందీగా విచారణ చేసి నేరస్తులను గుర్తించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని వైల్డ్ లైఫ్ విభాగం అధికారులను ఆదేశించారు. వన్న్య ప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని, కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ లాంటి నేరాలను సహించబోము అని నేరగాళ్లకు బలమైన సంకేతాలు వెళ్ళేలా కేసులుపెట్టాలని ఆదేశించారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *