మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రబి సీజన్ కు పంటలు వేసిన రైతులందరినీ పంటల బీమా పై అవగాహన కలిగించి అందులో నమోదు చేయించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్య కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుండి రబి 2024-25 పంటల బీమా నమోదుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రబి సీజన్లో వంటలు వేసిన ప్రతి ఒక్క రైతు పంటల బీమా లో నమోదు చేసేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహించాలన్నారు. కొన్ని నోటిఫై చేసిన పంటలకు మాత్రమే బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు.
పంటల బీమా వలన కలిగే ప్రయోజనాలను, చెల్లించవలసిన ప్రీమియం గురించి రైతులకు వివరించాలన్నారు.
ప్రీమియం డబ్బులు వృధా అవుతాయని భావించి కొందరు రైతులు చెల్లించకుండా ఉంటారని అటువంటి వారినందరిని చైతన్య పరచి పంటల బీమా లో నమోదు చేయించాలన్నారు. పంట రుణాలు పొందిన రైతులకు ఎలాగూ బ్యాంకులు బీమా చేయిస్తుంతాయని, 90 శాతం వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నందున కౌలు రైతులు, పంట రుణాలు పొందని వారీపై ప్రత్యేక దృష్టి సారించి పంటల బీమా చేయించాలన్నారు. ప్రత్యేకించి వాతావరణ ఆధారిత ప్రాంతాల్లోని రైతులను పంటల బీమా చేయించుకునేలా కృషి చేయాలన్నారు
వరి పంటకు ప్రీమియం పార్వతీపురం మన్యం జిల్లాలో తక్కువగా 84 రూపాయలు ఉండగా,,కర్నూలు జిల్లాలో ఎక్కువగా 630 రూపాయలు ఉందని,రాష్ట్ర సరాసరి 435 రూపాయలుగా ఉందన్నారు. వరి పంటకు వచ్చే డిసెంబరు 31వ తేదీ లోగా ప్రీమియం చెల్లించి పంటల బీమా లో నమోదు చేయించాల్సి ఉంటుందన్నారు. జీడిపప్పు పంటకు వచ్చే నవంబర్ 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, టమాటో ,కంది మినుములు, పెసలు,వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలు ఉల్లిగడ్డలు తదితర పంటలకు వచ్చే డిసెంబర్ 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు
బీమా ప్రీమియంకు మించి అదనంగా పైకము రైతుల నుండి వసూలు చేయరాదన్నారు. ప్రాంతాలను బట్టి పంటల బీమా ప్రీమియంలు తేడా ఉంటాయని ఆ విషయం కూడా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. అంతేకాకుండా వంట నష్టం తక్కువగా ఉన్నప్పటికీ పంట దిగుబడి ఎక్కువగా ఉంటే నష్టపరిహారం ఎక్కువ వస్తుంది అనే విషయం రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొంతమంది రైతులు సాంకేతిక పరమైన అంశాలలో అవగాహన లేకపోవడం వలన నష్టపోతుంటారన్నారు. జాతీయ పంటల భీమా పోర్టల్ అనే ఓకే వేదిక ద్వారా నేరుగా ప్రీమియం జమ చేయవచ్చన్నారు. అంతేకాకుండా కామన్ సర్వీస్ కేంద్రాలు, బ్యాంకు శాఖలు ద్వారా కూడా పంటల భీమా నమోదు చేయించుకోవచ్చన్నారు.
వచ్చే నవంబర్ డిసెంబర్ నెలల్లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాలను రెండు వారాలకు ఒకసారి చొప్పున నిర్వహించి పంటల బీమా నమోదు కార్యక్రమ పురోగతిని సమీక్షించాలన్నారు. వాస్తవంగా పంటలు సాగు చేస్తున్న రైతులకు సిసిఆర్సి కార్డులను సత్వరమే జారీ చేసి పంటల బీమా సౌకర్యం పొందే విధంగా చూడాలన్నారు. రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించుటకు, ప్రచారం చేయుటకు ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయుటకు వాటాదారులందరిని భాగస్వాములు చేయాలన్నారు.
ఈ కాన్ఫరెన్స్లో నగరంలోని కలెక్టరేట్ విసి హాలు నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు వ్యవసాయ సహాయకులకు పంటల బీమా పై అవగాహన కలిగించి జిల్లా వ్యాప్తంగా రైతులను పంటల బీమా లో నమోదు చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారి రవికాంత్ కు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లోసంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, కేడీసీసీ సీఈవో శ్యాం మనోహర్, వ్యవసాయ శాఖ డిడి మనోహర్, ఏడి మణిధర్, సిపిఓ గణాంక అధికారి పద్మజ పలువురు క్షేత్రస్థాయి ఏడీలు మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.