మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 25వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పశుసంపద లెక్కింపు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. గురువారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ విసి హాలులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 21 వ అఖిలభారత పశుగణన గోడ పత్రాలు, పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో పశుసంవర్ధక శాఖ సిబ్బందిచే పశుసంపద లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.
ఇందుకుగాను 216 మంది ఎన్యూమరేటర్లు, 46 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలకు తిరిగి పశుసంపదను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ 2000 నుంచి 3000 గృహాలను తిరిగి పశుగణన నిర్వహిస్తారన్నారు. జిల్లాలో గ్రామ ప్రాంతాల్లో దాదాపు 4,18,831, పట్టణ ప్రాంతాల్లో 1,04,426 గృహాలను తిరిగి పశుగణన అంచనా వేయడం జరుగుతుందన్నారు. పశుసంపద లెక్కింపు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని, గతంలో 2019లో 20వ భారత పశుగణన జరిగిందన్నారు.
ఎన్యూమరేటర్లు తగు గుర్తింపు కార్డులతో ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థలకు వెళ్లి పశు సంపద వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతి ఇంటి యజమాని, వాణిజ కార్యాలయాలు, దేవాలయాలు ఈ పశుగణనకు సహకరించి పశువుల వివరాలు తెలియజేయాలని కోరారు. పశువులు లేని ఇంటి యజమానులు కూడా సహకరించి తమ వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరారు.