Breaking News

విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

-అర్హులైన ఏ ఒక్కరికీ పరిహారం అందకుండా ఉండకూడదన్న సిఎం
-ప్రతి దరఖాస్తూ పరిశీలించి సాయం చేయాలని అధికారులకు ఆదేశం
-సాంకేతిక సమస్యల కారణంగా పరిహారం అందని వారికి రెండు రోజుల్లో సాయం అందించాలన్న సిఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటి వరకు మొత్తం రూ.618 కోట్ల పరిహారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముందుగా రూ.602 కోట్లు బదిలీ చేశామని…తరువాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాదాపు 9 వేల మందికి మరో రూ.16 కోట్లు చెల్లించామని అధికారులు తెలిపారు. తరువాత కూడా చాలా మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారని..వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. మళ్లీ కొత్తగా 2,954 దరఖాస్తులు రాగా….పరిశీలనలో 1,646 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించామని…..మిగిలిన వాటిలో 1052 దరఖాస్తులు అర్హత లేనివిగా తేల్చామని చెప్పారు. అర్హత కలిగిన 1,646 మందిలో 850 మందికి గురువారం(నేడు) బ్యాంక్ అకౌంట్లలో పరిహారం జమచేశామని చెప్పారు. మిగిలిన 796 మందికి రేపు వారి అకౌంట్లలో పరిహారం జమచేస్తామని అధికారులు సిఎంకు తెలిపారు. అకౌంట్ల వివరాల్లో తప్పులు, ఇతర సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. పరిహారం కోసం వచ్చే ప్రతి దరఖాస్తు పరిశీలించాలని అర్హులు ఉంటే తప్పకుండా సాయం అందేలా చూడాలని సిఎం ఆదేశించారు. సచివాలయాల్లో లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ప్రదర్శించాలని సిఎం సూచించారు. ఒకవేళ ఎవరైనా పరిహారం పొందడానికి అనర్హులు అయితే…ఆ విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజెప్పాలని ఆదేశించారు. మొత్తం 2954 దరఖాస్తుదారుల వివరాలను సచివాలయంలో, వెబ్ సైట్ లో ఉంచాలని సిఎం ఆదేశించారు. వీరితో పాటు మొదటి ఫేజ్ లోపరిహారం పొందిన 4,19,528 మంది పేర్లు కూడా ఆయా సచివాలయాల్లో ప్రదర్శించాలని సిఎం సూచించారు. బీమా విషయంలో తీసుకున్న చర్యలను అధికారులు సిఎంకు వివరించారు. ఇప్పటి వరకు 85 శాతం బీమా ప్రక్రియ పూర్తయ్యిందని…మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేస్తామని తెలిపారు. బీమా కంపెనీలతో చర్చించేందుకు రేపు వారిని పిలిపించాలని సిఎం అధికారులకు సూచించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసిందని…ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఏ ఒక్క అర్హునికి సాయం అందకుండా ఉండకూడదని…అందుకే ఇప్పటికీ ఈ అంశంపై తాను సమీక్షలు చేస్తున్నానని సిఎం అన్నారు. అతి పెద్ద విపత్తును అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం ఒకరిద్దరికి సాయం విషయంలో వెనకడుగు వేసేది లేదని చెప్పారు. అర్హత ఉన్న మిగిలిన అందరికీ సాయం అందుతుందని…..బాధిత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *