-ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని కోరుతున్నా
-కృష్ణానదిపై నిర్మించే రైల్వే బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జిగా మార్చాలి
-స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ కన్ స్ట్రక్షన్
-గత ఐదేళ్లు తప్పుడు కేసులకే ప్రాధాన్యత… ఇప్పుడు మేం మంచి చేస్తుంటే తప్పుడు ప్రచారాలు
-ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లీ, చెల్లిని రోడ్డుకు లాగిన వ్యక్తి మమ్మల్ని నిందిస్తున్నాడు
-జగన్ లాంటి చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు
-నాడు అధికారంలో ఉండి జగన్ మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు…కానీ నేడు జగన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు..అదీ వాళ్లకు మాకూ తేడా
-జగన్ దాచిన చీకటి జీవోలను బయటపెడతాం… పారదర్శక పాలన అందిస్తాం
-మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రైల్వేలైనుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి రైల్వే కనెక్టివిటీ వల్ల దేశంలోని అన్ని రాజధానులను అనుసంధానం చేసేందుకు వీలుగా కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గురువారం సీఎం చంద్రబాబు ఆన్ లైన్ లో కేంద్రం మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధ్వేరితో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….‘అమరావతి రైల్వే లైన్ కు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిమండలికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అమరావతికి ఈ రైల్వే లైను వేయడం వల్ల దేశంలోని అన్ని రాజధాని నగరాలకు అనుసంధానంగా ఉంటుంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా నగరాలను ఈ రైల్వేప్రాజెక్టు కలుపుతుంది. రూ. 2,245 కోట్లతో 57 కి.మీ. మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తే మరింత ఉపయోగపడుతుందని కోరుతున్నా. కృష్ణానదిపై నిర్మించే 3.2 కిమీ రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా మార్చాలని కోరుతున్నా. దేశంలోనే అమరావతి వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు బెస్ట్ సిటీగా ఉంటుంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా వివిధ మార్గాల్లో సాయం అందిస్తోంది. ఈ లైను నిర్మాణంలో భాగంగా 25 లక్షల చెట్లను నాటడం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ నివారించవచ్చు. రాష్ట్రంలో రూ.72 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఎప్పటి నుండో పెండింగులో ఉన్న రైల్వే జోన్ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. వచ్చే నెల లేదా డిసెంబరులో మంచి ముహూర్తం చూసి రైల్వే జోన్ కు ప్రధాని మోదీతో శంకుస్థాపన కూడా చేయిస్తాం. ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రం నుండి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా తగిన సమయంలోనే అందిస్తాం. 10 రోజుల క్రితమే ఢిల్లీలో పర్యటించినప్పుడు అమరావతి రైల్వే కనెక్టివిటీ గురించి ప్రధాని మోదీతో మాట్లాడాను…ఇంత తక్కువ సమయంలో కేబినెట్ ఆమోదించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం.’ అని అన్నారు.
గత ఐదేళ్లు ముందుకు సాగని ప్రాజెక్టులు
‘రణస్థలం-శ్రీకాకుళం రహదారిని 4 లేన్లుగా మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సంతోషం. 199 ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉన్నాయి. ఆర్ అండ్ బి, సీఎల్ఆర్, అటవీ శాఖతో సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. 8,744 కి.మీ మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ఇందులో కొత్తగా 3,300 కి.మీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో 6 లేన్ల రహదారులు తక్కువగా ఉన్నాయి. 8 లేన్ల రహదారులు కూడా రావాల్సి ఉంది. భూసేకరణ, అటవీ, పర్యావరణ క్లియరెన్స్ లేకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పనులు ప్రారంభించని ప్రాజెక్టులు 3 ఉన్నాయి. భూ సమస్యతో 70, అటవీ శాఖ అనుమతిలేక 20, టోల్ ప్లాజా సమస్యతో 2 పెండింగ్ లో ఉన్నాయి…ఈ విధంగా సుమారు 95 ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. 3 నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరించేలా అధికారులకు టార్గెట్ ఇచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయి…పనులు తీసుకున్న ఏజన్సీలు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని తెలిపాం. 636 కి.మీ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కుప్పం-హోసూరు, హైదరాబాద్-మచిలీపట్నం, మూలపేట-విశాఖపట్నం నిర్మాణంపై చర్చించాం. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం. నేషనల్ హైవేలతో పాటు రాష్ట్ర హైవేలను పూర్తి చేస్తే పోర్టుకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఆక్వా, హార్టికల్చర్ ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. ఏపీకి ఉండే కనెక్టివిటీపై అశ్రద్ధ పెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చాం. దీనికి అనుగుణంగా వేగంగా నిర్మాణాలు జరగాలి. లాజిస్టిక్ కాస్ట్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం.
సామాన్యులకు మరింత సులువుగా అందుబాటులో ఇసుక
‘సామాన్యులు, నిర్మాణదారులకు ఇసుక అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. గతంలో బినామీలను పెట్టుకుని ఇసుకను దారి మళ్లించారు. ప్రకృతి సంపదను దోచేశారు. ఇసుక సరఫరా లేకపోవడంతో 30 లక్షల మంది భవనిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో 108 కొత్త ఇసుక రీచ్ లకు అనుమతి ఇస్తున్నాం. గత ఐదేళ్లలో గాడి తప్పిన పనులను గాడిన పెడుతున్నాం. పెండింగ్ పనులన్నీ జరిగితే ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. గత ఐదేళ్లు తప్పుడు కేసులకే ప్రాధాన్యం ఇచ్చారు. మేం మంచి చేస్తుంటే చూసి భరించలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి-అనంతపురం హైవే అలైన్ మెంట్ ను మార్చేశారు. అమరావతి-కడప, గిద్దలూరు-అమరావతి పనులు పూర్తి చేశాక భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తాం. ప్రజాధనం మేం దుర్వినియోగం చేయం…విధ్వంసం చేయం. విధ్వంసం చేయడం ప్రారంభిస్తే ముగింపు ఉండదు. అమరావతి, పోలవరంను నిర్వీర్యం చేయడంతో ఆర్ధిక భారం పడింది. రాష్ట్రంలోని 93 శాతం మేర ప్రాజెక్టులు నీళ్లతో నిండి ఉన్నాయి. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం. త్వరలో వాటర్ పాలసీ తీసుకొస్తాం. ఒకప్పుడు కరువుతో రాష్ట్రం ఇబ్బంది పడేది. దేశంలోనే రాయలసీమను ఎకనమిక్ జోన్ గా మార్చాం. విజయవాడలో జరిగిన డ్రోన్ సమ్మిట్ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురానున్నాం. దీనికి సంబంధించి మంత్రి లోకేష్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లీ, చెల్లిని రోడ్డుకు లాగి మమ్మల్ని నిందిస్తున్నాడు
‘ప్రస్తుతం ఏపీ అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుకున్నారు. చీకటి జీవోలతో పాలన సాగించారు. ప్రభుత్వం పాలన అందించేటప్పుడు పారదర్శకత ఉండాలి. ఐదేళ్ల చీకటి జీవోలపై విచారణ చేయిస్తున్నాం. గత పాలకుల అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి. తల్లి, చెల్లితో గొడవలు పెట్టుకుని వాటిలోకి మమ్మల్ని లాగుతున్నారు. తండ్రి సంపాదించిన ఆస్తి తల్లికి రానివ్వకుండా చేస్తున్నాడు. తల్లి, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిపై కండీషన్ పెడతారా ఎవరైనా.? 2004లో జగన్ ఆదాయం ఎంత? ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దీపావళి నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించబోతున్నాం. కేంద్రం అమరావతికి డబ్బులిస్తామంటే వద్దన్నారు. ప్రజావేదిక కూల్చారు…నేను తలచకుంటే ఇప్పుడు కూల్చడాలు చేయలేనా.? అమరావతిని ఎడారిగా చేశారు. భూములిచ్చిన రైతుల ఇళ్లపై డ్రోన్లు ఎగరేశారు. తప్పుడు పనులు చేసి పరదాలు కట్టుకు తిరిగారు. ఇటువంటి వ్యక్తితో రాజకీయ చేస్తానని అనుకోలేదు. ఎంతోమందితో సిద్ధాంత పరంగా, అభివృద్ది పరంగా పోరాటం చేశాను. చిల్లరకంటే హీనమైన రాజకీయాలు జగన్ చేశారు. రోడ్లు మొత్తం గుంతలు పెట్టారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పేరబెట్టారు. చెత్త పన్ను కట్టలేదని ఇంటిముందు చెత్తవేశారు. ఆ పార్టీలో ఉండేవారు కూడా పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడాలి. విలువల్లేని మనుషులతో సమాజానికి చేటు. చెత్తటీవీ, చెత్త పేపరులో నోటికొచ్చింది రాసుకున్నారు. గత ఐదేళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. కానీ మేం జగన్ ను తిరగనిస్తున్నాం. అమరావతిలో పర్యటించిన సమయంలో నాపై రాళ్లు వేయించారు… ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుందని నాటి డీజీపీ అన్నారు. ఇప్పటి అధికారులకు నేను అలా చెప్పడం లేదు. తెనాలి అత్యాచారం కేసులో నిందితుడి తల్లే చెప్తోంది…వైసీపీలో చేరి తన కొడుకు చెడిపోయాడని. బంధువుల మధ్యే నేరం జరిగిందని చెప్తుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు’’ అని సీఎం అన్నారు.