-ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు లకు ధన్యవాదాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రమంత్రి వర్గంలో ఏపీకి ప్రాధాన్యత కల్పిస్తూ అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినందకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు, ఇందుకోసం కోసం కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతానికి దేశంలోని పలు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగే విధంగా రూ.2,245 కోట్లతో 57 కిలో మీటర్ల రైల్వే లైన్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపటం రాష్ట్రానికి భారీ ప్రోత్సాహమన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నెరవేర్చుకుంటున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ప్రకటించటం, ఇప్పుడు రూ.2,245 కోట్లతో అమరావతి కి రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం శుభపరిణామని పేర్కొన్నారు. అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతలైన మైలవరం, నందిగామ కూడా కలిసే విధంగా ఈ రైల్వే లైన్ వుండటం ఆ ప్రాంత అభివృద్ది కి దోహదపడుతుందన్నారు. సీఎం చంద్రబాబు కృషి, ప్రధానమంత్రి మోదీ సహకారంతో అమరావతి నిర్మాణం, రాష్ట్రాభివృద్ది పురోగమనంలో పయనిస్తుందన్నారు. గత వైసిపి ప్రభుత్వం అమరావతి విధ్వంసంతో పాటు అమరావతి రైల్వే లైన్ ను ఐదేళ్లూ పూర్తిగా తొక్కిపెట్టిందన్నారు. సీఎం గా చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్లే కేంద్రంలో ఈ ప్రాజెక్ట్ కి ఆమోదం లభించిందన్నారు.