గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలని, ఏబిసి చేసే ఏజన్సీ నిబందనలను పటిష్టంగా పాటించేలా జిఎంసి నుండి ప్రత్యేకంగా పర్యవేక్షణకు అధికారులను కేటాయిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో వీధి కుక్కల నియంత్రణ, సమస్యలు, పరిష్కార మార్గాలపై వివిధ జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, జిఎంసి, ప్రభుత్వ పశువైద్య విభాగ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు ఏబిసి కోసం ఏటుకూరు రోడ్ లో ప్రత్యేక సెంటర్ ని ఏర్పాటు చేశామని, అందులో స్నేహ యానిమల్ వెల్ఫేర్ సంస్థ ఏబిసి చేస్తుందన్నారు. ఏబిసి నిర్వహణపై పలు స్వచ్చంద సంస్థలు, జంతు ప్రేమికులు పలు ఫిర్యాదులు చేస్తున్నారని, సదరు ఏజన్సీ తప్పనిసరిగా నిబందనలు పాటించాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ అనంతరం మరింత శ్రద్ధ చూపాలని, నిపుణులైన వైద్యులు, అదనపు సిబ్బందిని కేటాయించుకోవాలని ఏజన్సీకి స్పష్టం చేశామన్నారు. అలాగే అతి ముఖ్యమైన అంశంగా ఏ ప్రాంతంలో పట్టుకున్న కుక్కను ఆపరేషన్ అనంతరం అదే ప్రాంతంలో వదలాలని, ముందు, తర్వాత స్థానికుల సంతకాలు తీసుకోవాలని ఏజన్సీ ప్రతినిధులకు తెలిపారు. అనంతరం జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఏబిసి పక్కగా నిబందనల మేరకు జరిగేలా జిఎంసి నుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై అనేక ఫిర్యాదులు అందుతున్న దృష్ట్యా ఏబిసి సజావుగా జరిగేందుకు ఆయా ప్రతినిధులు సహకరించాలన్నారు. ఏబిసి మెరుగ్గా జరిగేందుకు ప్రభుత్వ పశువైద్య విభాగం నుండి ఒక డాక్టర్ ని డెప్యుటేషన్ లో తీసుకుంటామని, త్వరలో లోకల్ మోనిటరింగ్ కమిటిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. విడతల వారీగా ఏబిసి సెంటర్ ని పరిశీలనకు గుర్తింపు పొందిన జంతు ప్రేమికుల సంస్థల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని, వారు పరిశీలించిన అంశాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓలు డాక్టర్ రవిబాబు, రామారావు, బయాలజిస్ట్ మధుసూదన్, ప్రభుత్వ పశువైద్య శాఖ నుండి డిడి రత్నజ్యోతి, ఏడి నాగేశ్వరరావు, ఏవిఎస్ ఈశ్వరరెడ్డి, వివిధ స్వచ్చంద సంస్థల, జంతు ప్రేమికులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
త్వరలో నూతన టెక్స్ టైల్స్ పాలసీ
-అసెంబ్లీలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత -రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటు -ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, …