Breaking News

జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమం…

-శాసనసభ్యులు గద్దె రామమోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైకాపా ప్రభుత్వంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక కూరగాయలు అమ్ముకునే పరిస్థితులు దాపురించాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యంలో 6వ డివిజన్ మాచవరం బి.ఎస్.ఎన్.ఎల్ సమీపంలో జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత కూరగాయలు అమ్ముతూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ లక్షలాది మంది యువత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించే స్థితిలో లేదని, ఉన్న ఉద్యోగులకు జీతాలు అందించలేకపోతుంది, పెన్షన్లు, డి.ఏలు ఇవ్వడం లేదన్నారు. కేవలం ప్రకటనల ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతను మోసం చేయాలని చూస్తుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కూరగాయలు అమ్ముకునే పలువురు మహిళలను వారి ఆదాయ పరిస్థితి అడగగా వారంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరు వ్యాపారాలు చేసుకునే తమకు రోజుకు రూ.1000 నుంచి రూ.500 ఆదాయం ఉండేదని, ప్రస్తుతం చదువుకున్న యువత సైతం ఉద్యోగాలు లేక కూరగాయలు అమ్ముకుంటున్నారని దాని ఫలితంగా మాకు కూడా వ్యాపారాలు లేక రోజుకు రూ.200 సంపాదించడానికి కష్టంగా ఉందని కూరాగాయలు అమ్ముకునే మహిళలు ఆవేదన చెందుతున్నారన్నారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రతి కుటుంబం నెలకు రూ.15 వేలు సంపాధించుకునేలా ఆదాయ మార్గాలు చూపాల్సిన ప్రభుత్వం, ఆ మార్గాలు చూపకుండా సంవత్సరానికి రూ.15 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. యువతను మోసం చేసేలా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు నిరసనగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యువత రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని, వారు చేసే ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు, బెదిరింపులు మానుకోవాలని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని కోరారు.

పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు షేక్. నాగూర్ మాట్లాడుతూ గత నెల 18 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను నిరుత్సాహపరిచిందని, జగన్‌ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చెప్పునట్లుగా రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, రెండు సంవత్సరాల వైకాపా పాలనలో ఎటువంటి ఉద్యోగాలు కల్పించలేదని, ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి యువతను మోసం చేస్తున్నారన్నారు. జాబుల్లేని జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి, జగన్ తన పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనీ, లేనిపక్షంలో రానున్న కాలంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు పడాల గంగాధర్, ఖాశీ, పులిపాటి రాజు, పడాల వాసు, పీతల మనోజ్, షేక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *