-మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తోటి వారికి సహయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఏ మత గ్రంధంలోనైనా ఇదే విషయం ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సహాయం పోరుగు వారికి చేయాలని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ రెండో రోడ్డులో జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి దుప్పట్లు ప్లేట్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యఅతిధిగా హజరై వాటిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ కరోనా వచ్చి రోడ్డుపై మనుషుల సంచారం లేని రోజుల్లో, వరదలు వచ్చి వారి ఇళ్ళు నీటిలో మునిగిపోయినా డివిజన్ కు వచ్చి మున్సిపల్ సిబ్బంది మన కాలనీలోని రోడ్లు , మన ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచారన్నారు. మున్సిపల్ సిబ్బంది రెండు రోజులు విధులు నిర్వహించకపోతే మన కాలనీ ప్రాంతాలు చెత్తతో నిండి విపరీతమైన దుర్వాసన వస్తాయన్నారు. అలాంటి వారికి పవన కుమార్ పుట్టిన రోజు సందర్భంగా బట్టలు పంపిణీ చేయాలనే ఆలోచన రావడం నిజంగా అభినందనీయమని అన్నారు. పొరుగు వారి ఆకలిని గుర్తించి ఆ ఆకలిని తీర్చడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని చెప్పారు. ఏ మత గ్రంధం చదివినా అందులో తోటి వారి ఆకలిని తీర్చమనే ఉంటుందన్నారు. జయ భారత్ ట్రస్ట్ తరపున భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కార్పోరేటర్ జాస్తి సాంబశివరావుతో పాటుగా జయ భారత్ ట్రస్ట్ సభ్యులు, కాలనీ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.