-యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన ఏజెండా
-ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, వారి తనయుడు గద్దె క్రాంతికుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో పట్టభద్రులు వారి ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు.
మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో పాటుగా గద్దె అనురాధ మరియు వారి తనయుడు గద్దె క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యత్వానికి బీజేపీ, టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజా పోటి చేస్తున్నారని చెప్పారు. తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని యువత ఉత్సాహంగా నిర్వహిస్తున్నామన్నారు. పట్టబధ్రులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. కనీసం సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాల చొప్పున ఐదు సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగం లేనివారికి నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో చర్చించడానికి మండలిలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన సభ్యుల అవసరం చాలా ఉందన్నారు. ప్రతి గ్రాడ్యూయేట్ ఓటరుగా నమోదు కావాలని చెప్పారు. ఎన్నికల్లో ఏవరికి ఓటు వేసినా ముందు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోడానికి ఏ పత్రాలు కావాలి, ఆన్‌లైన్‌లో ఎలా ఫిల్ చేయాలి, ఆఫ్‌లోడ్ ఎలా చేయాలనే అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పారు.
గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కార్యక్రమం తూర్పు నియోజకవర్గ పరిధిలో చాలా ఉత్సాహంగా జరుగుతుందన్నారు. ఓటరుగా నమోదు కావడానికి పాస్‌ఫోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, డిగ్రీ ప్రొవెజనల్ సర్టిఫికెట్ అవసరమని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కార్యాలయం తోపాటుగా గాయత్రినగర్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పట్టభద్రులందరూ నవంబరు 6వ తేదిలోగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా గద్దె క్రాంతి కుమార్ కోరారు.
ఈ కార్యక్రమములో అన్నాబత్తుల బాబి, బద్రి, కర్ణా కోటేశ్వరరావు, కోగంటి ప్రసాద్, అన్నాబత్తుల శ్రీదేవి, కర్రి రాజేష్, కర్ణా రమేష్, షేక్ హాసీఫ్, ఎన్‌ఆర్‌ఐ స్కూల్ డీన్ లక్ష్మణరావు, ఎన్‌ఆర్‌ఐ స్కూల్ టీచర్ గోశాల అవినాష్ తదితరులు పాల్గొన్నారు.