-ఆర్.డబ్ల్యూ.ఎస్. విభాగం ఎస్.ఈ., ఈ.ఈ.లతో నవంబర్ 8న వర్క్ షాప్
-జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో జె.జె.ఎం.లో చేపట్టిన పనుల్లో లోపాలను గుర్తించాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి పంపించిన నిధులను గత ప్రభుత్వం ఏ దశలోనూ సక్రమంగా వినియోగించలేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన పనుల్లో పైప్ లైన్లు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేయలేదని సమీక్షల ద్వారా తేలింది. పలు చోట్ల అసలు పనులే మొదలు కాలేదు. వీటిని సరిదిద్దుతూ పనులు వేగవంతం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంది.
జల్ జీవన్ మిషన్ పనులు సక్రమంగా చేపట్టడం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని ఇవ్వగలం. ప్రభుత్వం ఎంత ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టబోతుందో, ఇందుకు అనుసరించే ప్రణాళికలను తెలియచేసేందుకు ఆర్.డబ్ల్యూ.ఎస్. విభాగానికి చెందిన ఎస్.ఈ.లు, ఈ.ఈ.లతో ఒక వర్క్ షాప్ నిర్వహించాలి. అదే విధంగా క్షేత్ర స్థాయి ఇంజినీరింగ్ సిబ్బందికి ఓరియెంటేషన్ కార్యక్రమం చేపట్టాలి” అన్నారు. ఎస్.ఈ.లు, ఈ.ఈ.లతో వర్క్ షాప్ ను వచ్చే నెల 8వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్.డబ్ల్యూ.ఎస్. సి.ఈ. సంజీవ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News