Breaking News

పేద ప్రజలను ఆదుకునేందు కోసం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలను ఆదుకునేందు కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను కింద సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయల అదనంగా ఖర్చు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం  రాష్ట్ర మంత్రివర్యులు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగరం 5 వ డివిజన్లోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులు దివ్యాంగులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తొలుత మంత్రి ఎన్టీఆర్ కాలనీలో తుమ్మలపల్లి మహేశ్వరరావు, కోట కృష్ణవేణి, యార్లగడ్డ విజయలక్ష్మి, లతో కలసి ఆరుబయట బండపై కూర్చొని కాసేపు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కోటా కృష్ణవేణికి 4000 రూపాయల పింఛన్ నగదు మంత్రివర్యులు అందజేశారు. యార్లగడ్డ విజయలక్ష్మి మాట్లాడుతూ తనకు ఇదివరకు వస్తున్న పింఛన్లు గత ప్రభుత్వం ఆపివేసిందని ఎక్కడో ఉన్న తన అల్లుడు ఉద్యోగం చేస్తున్నారని తనకు పింఛన్లు ఇవ్వడం లేదని కన్నీరు పెట్టుకోగా మంత్రివర్యులు ఆమెను ఓదార్చి పింఛను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి తుమ్మలపల్లి మహేశ్వరరావు ఇంట్లోకి వెళ్లి అక్కడి వారి సతీమణి కుసుమకుమారి, లేవలేని కుమారుడు నాగరాజు దివ్యాంగులు కావడంతో ఒక్కొక్కరికి 6000 రూపాయల చొప్పున పింఛన్ల నగదును మంత్రివర్యులు అందజేశారు.
ఈ సందర్భంగా చిలకలపూడి గోదాముల వద్ద నివసిస్తున్న మద్దూరు శారద అనే మహిళ తనకు జగనన్న కాలనీలో ఇల్లు మంజూరై కొంతవరకూ నిర్మించుకున్నామని, పై కప్పు కోసం 40 వేల రూపాయలను, కొంత ఇంటి సామాగ్రిని కొండపల్లి శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కు అందజేశామని, అయినప్పటికీ అతను తన ఇల్లు పూర్తి చేసి ఇవ్వలేదని, ఫిబ్రవరి మాసంలో అతనిపై ఫిర్యాదు కూడా చేశామన్నారు తమకు న్యాయం చేసి ఇల్లు నిర్మించేలా చూడాలని మంత్రికి మొరపెట్టుకున్నారు. దీనిపై మంత్రి వెంటనే స్పందిస్తూ ఆమెను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దారిలో వెళుతూ చలపాటి సుబ్బలక్ష్మికి, అంకెం వరప్రసాద్కు 4000 రూపాయల చొప్పున, దివ్యాంగులైన దేవరపల్లి జానకి రాణికి 6000 రూపాయల నగదును మంత్రివర్యులు అందజేశారు. అలాగే మార్గమధ్యలో గత 7 నెలల కిందట టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో కాళ్లు గాయపడి నడవలేని స్థితిలో ఉన్న జొన్నలగడ్డ శివప్రసాద్ ను మంత్రి పలకరించి ప్రమాదం ఎలా జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మన్నెం చిట్టయ్య, కొవ్వలు అప్పారావు కొడాలి దుర్గ, ఎం బాబురావు, ఎం విజయసారథి, పి. పుణ్యవతి, బి రామకృష్ణ, కూరేటి రాధాకృష్ణ తదితర లబ్ధిదారులకు కూడా మంత్రివర్యులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పింఛన్ల నగదును అందజేశారు.

తదనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రజల స్థితిగతులు, పేదరికాన్ని గమనించి వారికి మేలు చేయాలని సంకల్పంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతినెలా 1 వ తేదీన 4000 రూపాయల పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఆ ప్రకారం నవంబర్ 1 వ తేదీన తెల్లవారుజాము నుండి పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైందన్నారు.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన రాష్ట్రం అన్ని విధాల నాశనం అయిందని, మొత్తం అన్ని సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నామన్నారు.

పెంచిన పించను పంపిణీ వలన దాదాపు 2,700 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తున్నామన్నారు.
ఆ ప్రకారం సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలను పింఛను పెంపు వలన అదనంగా ఖర్చు చేస్తున్నామన్నారు.

గతంలో కొంతమందికి వస్తున్న పింఛన్ను వైసిపి ప్రభుత్వం లో ఆపివేశారని వాటిని మరలా పరిశీలించి అర్హులైన పేద వారందరికీ తప్పనిసరిగా పింఛన్లు అందజేస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ లో భాగంగా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఈరోజు నుండి ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నారన్నారు.

గత వైసిపి ప్రభుత్వం లో రహదారులన్నీ గుంతలమయమై పట్టించుకునే పరిస్థితి లేదని , తమ ప్రభుత్వం రేపటి నుండి గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో ప్రారంభిస్తున్నారన్నారు..
అంతర్గత రహదారులు, రాష్ట్ర, జాతీయ రహదారులు అన్నిటిని బాగు చేస్తున్నామన్నారు.
అలాగే ఇదివరకే గ్రామీణ రహదారులు, మురికి కాలువల నిర్మాణానికి 4,500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని వచ్చే సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు.
మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా వెళ్లి అక్కడి మైక్రోసాఫ్ట్ తదితర చాలా కంపెనీ ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారని, ఆ విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే రాష్ట్రానికి వనరులు పెరిగి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటికే ఉన్న కంపెనీలు అన్నీ పారిపోయాయన్నారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రివర్యులు సమాధానం చెబుతూ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు గానీ కొరతలు గాని ఏమీ లేవన్నారు. అందుకే కొత్త పాలసీ తెచ్చామని రెన్యువబుల్ ఎనర్జీ, గాలిమరలు, సోలార్, పంపింగ్ ఎనర్జీలు, కొత్తగా హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు కృషి చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే పరిశ్రమలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కొత్త పరిశ్రమల విధానం తెచ్చామని రాబోయే రోజుల్లో సామాన్యులు సైతం పరిశ్రమలు నెలకొల్పి పారిశ్రామికవేత్తలుగా తయారుకావచ్చన్నారు. ఇందుకోసం ఈనెల 9 వ తేదీన మచిలీపట్నం నగరంలో ఎం ఎస్ ఎం ఈ లతో సమావేశం నిర్వహించనున్నామన్నారు.

కొందరు మీడియా ప్రతినిధులు విద్యుత్ ఛార్జీల పెంపుపై అడిగిన ప్రశ్నకు మంత్రివర్యులు సమాధానం చెబుతూ గత ప్రభుత్వం విద్యుత్ బకాయిలు, ట్రాన్స్మిషన్ పై పెద్ద ఎత్తున దెబ్బతీసిందని, అనేక విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయని ఇవన్నీ సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. ప్రజల పైన ఎలాంటి భారం ఉండదని, తప్పకుండా రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి,అవసరమైతే గతంలో చెప్పినట్లుగా విద్యుత్ ఉత్పాదన పెరిగాక విద్యుత్ ఛార్జీలు తగ్గించడం కూడా జరుగుతుందన్నారు

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని, ఇచ్చిన హామీల నెరవేర్చుటకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఇచ్చిన హామీలలో భాగంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక ప్రముఖ నాయకులు బండి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కాశీ విశ్వేశ్వరరావు, వార్డు సచివాలయ కార్యదర్శులు వై అనిల్ బాబు, బి రమేష్ బాబు, ఏ శివరామకృష్ణ, ఎం పవన్ కుమార్,,ఎండి ఫాతిమా, ఏఎన్ఎం డి శ్రీదేవి, వి ఆర్ ఓ. బి. శాంతి స్థానిక నాయకులు రత్నాకర్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Check Also

సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *