విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాతా శిశు మరణాలకు సరైన కారణాలు లేకపోయినా మరణాలలో ఇటువంటి లోపాలను గుర్తిస్తే సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ప్రభుత్వ వైద్యులు జవాబుదారీతనంతో సేవలందించాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. ఈ ఏడాది జులై ,ఆగస్ట్ ,సెప్టెంబర్ మాసాలలో జిల్లాలో జరిగిన రెండు మాతా, నాలుగు శిశు మరణాలకు గల కారణాలపై శనివారం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలపై పూర్తిస్థాయి సమీక్షా నిర్వహించి మరణాలకు గల కారణాలపై వైద్యులు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా గర్భం దాల్చిన సమయం నుండి బిడ్డకు జన్మనిచ్చి ఎదిగేవరకు కంటికి రెప్పలా కాపాడి వారి పూర్తి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ద పెట్టినప్పుడే మరణాలను నివారించగలుగుతామన్నారు. జులై ,ఆగస్ట్ ,సెప్టెంబర్ మాసాలకు సంబంధించి నాలుగు శిశు మరణాలు, రెండు మాతృ మరణాలు సంభవించాయన్నారు. ఇందుకు గల కారణాలను సమీక్షిస్తున్నపుడు వైద్యులు సిబ్బంది ఎవరికివారు తమ తప్పేమిలేదని అంతా బాగానే చూసామాని చెబుతున్నారని అటువంటప్పుడు మరణాలు ఎందుకు సంభవిస్తాయని అన్నారు. మాతా శిశు మరణాలకు కారణం ఎవరికివారు మాదికాదని మేము అంత బాగానే చూశామని చెప్పడం న్యాయం కాదన్నారు. ఇక నుండి ప్రతి కేసును సంక్షిప్తంగా సమీక్షించి నివారణ చర్యలను చేపట్టకపోతే సమావేశాలను నిర్వహించడంలో అర్ధం లేదన్నారు. వైద్యం చేయడంలో వచ్చే పేరు ప్రఖ్యాతలు ఒక మరణంతో దిగజారిపోతాయని గుర్తించుకోవాలన్నారు. మరణించిన వారిలో నిరుపేదలైన కుటుంబాలకు చెందిన తల్లులు, శిశువులు ఉండడం బాధాకరమన్నారు. గర్భిణీ దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించి లోపాలను నివారించాలన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే భావన ప్రజల్లో కలగరాదన్నారు. మాతా శిశు మరణాలు పునరావృతం కాకూడదని, వైద్యుల నిర్లక్ష్యంతో మరణాలు సంభవించినట్లు గుర్తిస్తే సంబంధిత వైద్యాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి, జిజిహెచ్ వైద్యులు డా. ఆర్. సౌజన్య, డా. సవిత, డా. మదీన అహ్మద్, సిద్ధార్దా మెడికల్ కళాశాల వైద్యురాలు డా. ఎన్ సుమతి, డిస్ట్రిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డా. అమృత, డిప్యూటి డియం అండ్ హెచ్ ఓ డా. హిందుమతి, టిబి యం హెచ్ ఓ డా. పద్మావతి, ఐసిడిఎస్ సిడిపివో జి మంగమ్మ, ఎం. నాగమణి, సూపర్వైజర్లు, ఏ ఎన్ ఎం లు పాల్గొన్నారు.