-ఆస్ట్రేలియా నుంచి ఫోన్ ద్వారా సోమవారం ఉదయం సందేశం పంపిన ఎంపీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజక వర్గం ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ప్లెక్సీ కడుతూ బొల్ల వీర్రాజు(27), కాసగాని కృష్ణ(27), మారిశెట్టి మణికంఠ(29), పామర్తి నాగరాజు(26) కరెంట్ షాక్ తో మృతి చెందడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి హాజరైన ఆమె తాడిపర్రు దుర్ఘటన గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేసారు అధికారులతో మాట్లాడి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావు(39) కు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ పురందేశ్వరి సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె పేర్కొన్నారు.