Breaking News

ఆద్యంతం ప్రజా సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..

-పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తూ..
-పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి అడుగులో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, సమస్య ఉన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బాధితులకు భరోసా నింపుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పర్యటన సాగింది. పవన్ కళ్యాణ్ రాక విషయం తెలుసుకుని ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రోడ్ల వెంట బారులు తీరారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మధ్య ప్రజలు తమ గ్రామాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై దృష్టి సారించి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రమాదంలో కాళ్లుపోయాయి.. బీమా రాలేదు
పిఠాపురం టీటీడీ కళ్యాణ మండపం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ని అబ్రహం అనే దివ్యాంగుడు కలిశారు. గోడ కూలిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయానని, సదరం సర్టిఫికెట్ ఆలస్యం కావడం వల్ల గత ప్రభుత్వంలో బీమా ఇవ్వలేదని. అదే ప్రమాదంలో చనిపోయిన ఇరువురికీ బీమా వర్తింప చేశారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని తన గోడు వెళ్లబోసుకున్నారు. అబ్రహం సమస్య పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.

అన్యాక్రాంతం అయిన రాములోరి భూములకు రక్షణ కల్పించండి
700 సంవత్సరాల చరిత్ర కలిగిన గోరస శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, ఆలయ భూములు ఆక్రమించుకున్న వారంతా సిండికేట్ గా మారి దోచుకుంటున్నారంటూ ఆ గ్రామానికి చెందిన పలువురు పిఠాపురం, యు.కొత్తపల్లి మధ్య పవన్ కళ్యాణ్ ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. సీతారామస్వామి వారి భూములకు రక్షణ కల్పించాలని కోరారు.
నవ కండ్రవాడ గ్రామ సర్పంచ్ బి. సురేష్ తమ గ్రామంలో డ్రెయినేజ్, రహదారి సమస్యలను  పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. గ్రామంలో జీర్ణావస్థకు చేరుకున్న రామాలయాల పునర్నిర్మాణం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎండవల్లి జంక్షన్ సమీపంలోని వాకతిప్ప కాలనీ వాసులు తాగు నీటి సమస్యతో తాము పడుతున్న ఇబ్బందులను ఉపముఖ్యమంత్రివర్యులకు వివరించారు.

రధాలపేట కాలనీలో పవన్ కళ్యాణ్ పర్యటన
పిఠాపురం రైల్వే అండర్ పాస్ సమీపంలోని రధాలపేట రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలనీ వాసులు తమ ప్రాంతంలో పారిశుధ్యం, రంగు మారిన రక్షిత మంచినీటి సరఫరా అంశాలను పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. పవన్ కళ్యాణ్  వాహనం నుంచి దిగి వెళ్లి రధాలపేట కాలనీలో పారిశుధ్యం, రక్షిత మంచి నీటి సరఫరా తీరుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల సమస్యను కాలనీ వాసులు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. రధాలపేట కాలనీ వాసుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా కాలనీకి చెందిన  మహేందర్ అనే వ్యక్తి ఇటీవల నాలుగో అంతస్తు భవనం నుంచి పడి తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదే సెంటర్ లో విద్యార్ధులు తమ పాఠశాలకు ఆట స్థలం కావాలని పవన్ కళ్యాణ్ ని కోరారు.

గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు
పిఠాపురం పట్టణంలోని యానాదుల కాలనీ వద్ద కాలువపై ప్రమాదకరంగా ఉన్న సిమెంటు బల్ల వంతెన స్థానంలో శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్ ని కోరారు. త్వరలో అందరి సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దుర్గాడ గ్రామానికి చెందిన కుమూరి గంగాధర్ ఉప ముఖ్యమంత్రివర్యులను కలిసి గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారు చేశారని ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులకు అనుకూలంగా రికార్డులను తారుమారు చేసిన రెవెన్యూ, సర్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *