-నియోజకవర్గవ్యాప్తంగా వివిధ పనులకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ప్రజల తక్షణ అవసరాలుగా పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సోమవారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గొల్లప్రోలుతో పాటు పిఠాపురం పట్టణం. యు.కొత్తపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
పిఠాపురం పట్టణంలో రూ. 4.11 కోట్లతో అభివృద్ధి పనులు
పిఠాపురం పట్టణంలో పారిశుధ్యం, సుందరీకరణ, డిగ్రీ కళాశాల, టీటీడీ కళ్యాణ మండపం ఆధునీకరణ తదితర అభివృద్ధి పనులకు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపనలు చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో రూ. 93 లక్షల తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిధులతో పిఠాపురం పట్టణ పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపం, మాడ వీధుల ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు.
రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురం పట్టణంలో పారిశుధ్యం, సుందరీకరణ, సంత మార్కెట్ లో మౌలిక సదుపాయాల కల్పన తదితర పసులను ప్రారంభించారు. పిఠాపురంలో రూ.1.50 కోట్ల నిధులతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. రూ. 23 లక్షల అంచనా వ్యయంతో సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్.బి.ఎం.ఆర్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ. 10.50 లక్షల అంచనా వ్యవయంతో ఆట స్థలం ఆధునీకరణ పనులు ప్రారంభించారు.
యు.కొత్తపల్లి మండల పరిధిలో..
అనంతరం సోమవారం సాయంత్రం యు.కొత్తపల్లి మండల పరిధిలో పలు అభివృద్ధి పనులను ఉపముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు. రూ.7.5 లక్షల అంచనా వ్యయంతో యు.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ పేషెంట్ బ్లాక్ నిర్మాణానికి, శోంఠివారిపాకలు, నిదానం దొడ్డి, రవీంద్రపురం తదితర గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో రూ. 16 లక్షల చొప్పున అంచనా వ్యయంతో తరగతి గదుల నిర్మాణం, మూలపేట సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ఆధునీకరణ పనులకు శంకుస్థాపనలు చేశారు.