-ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణం పెద్దల దృష్టికి తీసుకువెళ్లండి
-అకతాయిల పట్ల అప్రమత్తత అవసరం
-కాకినాడ రూరల్ నియోజకవర్గం పి.వెంకటాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్ధినుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-గురుకులంలో అభివృద్ధి పనులకు రూ. 20 లక్షల మంజూరు
-15 రోజుల్లో ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘చదువుతోపాటు బాలికలు వ్యక్తిగత భద్రతపై కూడా దృష్టి సారించండి. ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటు వద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధినుల భద్రత ఎంతో ముఖ్యమ’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతతోపాటు అకతాయిల పట్ల కూడా అప్రమత్తత అవసరం అని చెప్పారు. పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థినుల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. ఎవరు ఇబ్బంది పెడుతున్నా తక్షణం అధ్యాపకులు, తల్లిదండ్రులతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని విద్యార్థినులకు సూచించారు. బాత్ రూముల్లో కెమెరాల లాంటివి పెడుతున్నారా అన్న అనుమానాలు కలిగితే ఏమరపాటుగా ఉండాలన్నారు. స్వీయ భద్రతపై తగిన నైపుణ్యాలను కూడా విద్యార్థినులు తెలుసుకోవాలని సూచించారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ రూరల్ పరిధిలోని పి.వెంకటాపురం గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాన్ని సందర్శించారు. గురుకులం అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 20 లక్షలు మంజూరు చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చుదువుతున్న విద్యార్థినులతో క్లాసు రూములో ముఖాముఖీ మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గురుకులం సైన్స్ ల్యాబ్ లో విద్యార్ధునులు చేసిన ప్రయోగాలను తిలకించారు.
అనంతరం వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నేటి విద్యార్ధులే రేపటి దేశ భవిష్యత్తు. మీలో కుల, మత, ఆర్ధిక బేధాలతో సంబంధం లేని ఆలోచనలు ఉంటాయి. దేశ భక్తి ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు దేశాన్ని గౌరవించండి. శాస్త్ర, సాంకేతికతను అర్ధం చేసుకోండి. మన దేశంలో ఉన్న భిన్న సంస్కృతులను అర్ధం చేసుకోండి. చదువుకొని విదేశాలకు వెళ్లడం అన్న ఆలోచన కాకుండా మన మేధస్సు మన దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి అన్న ఆలోచనలు చేయండి. అదే నిజమైన దేశ భక్తి. చదువు విషయంలో కూడా భిన్నమైన సబ్జెక్టులు, భిన్నమైన అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి.
భవిష్యత్తు మీది.. 2047 నాటికి దేశాన్ని మీరే నడిపించాలి
పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను విద్యార్ధులు భుజాన వేసుకోవాలి. పర్యావరణం విషయంలో పెద్దవారు తప్పులు చేస్తుంటే సరిచేయండి. చెరువులు కలుషితం చేస్తుంటే ఇది మా భవిష్యత్తు చేయకండి అని తెలిచెప్పండి. పర్యావరణ పరిరక్షణ కోసం నేను నావంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనందరి బాధ్యత అంతా నాతో కలసి రావాలి. గోదావరి జిల్లాల్లో చుట్టూ నీరు పారుతున్నా తాగేందుకు మంచి నీరు లేదు. అభివృద్దితోపాటు పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించాలి.
మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సాధించండి
కాలుష్యం బారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు విద్యార్ధులు పరిష్కార మార్గాలు వెతకాలి. ఒక మనిషి తలుచుకుంటే ఎన్నో అంశాలపై పని చేయగలరు. ప్రజ్ఞాశాలిగా మారగలరు. ఈ సమస్యలకు మీరే పరిష్కార మార్గాలను తెలుసుకోగలరు. దీని ద్వారా మీకు బలమైన గుర్తింపు వస్తుంది. నాయకత్వ లక్షణాలు వస్తాయి. నాయకుల్లాగా వ్యవహరించడం అంటే రాజకీయ నాయకులు లాగా కాదు. ఆలోచన కలిగిన నాయకుల్లాగా ఆలోచించండి. దీనికి డబ్బు అవసరం లేదు. సృజనాత్మకత పెంచుకోండి. చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించుకోండి. మీకు నచ్చిన ఏదైనా ఒక క్రీడలో నైపుణ్యం పెంచుకోండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగపడే సాంకేతికతను పరిచయం చేసే స్థాయికి ఎదగాలి. విభిన్న భాషలు నేర్చుకోండి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు- భవిష్యత్తు మీది. 2047 నాటికి దేశాన్ని మీరే నడిపించాలి. మీరంతా అద్భుత ప్రగతి సాధించాలి. గొప్ప శాస్త్రవేత్తలు కావాలి. లియోనార్డి డావెన్సీ లా వివిధ అంశాలపై అవగాహన పెంచుకోండి. మనిషి శక్తి అనంతం. ఆ శక్తిని గుర్తించండి. సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. విజువల్ థింకింగ్, మైండ్ మ్యాపింగ్, డూడ్లింగ్ పై అధ్యాపకులు కూడా దృష్టి సారించాలి.
విద్యార్థినులు నాలుగు గోడలకు పరిమితం కావద్దు. మార్షల్ ఆర్ట్స్, యోగా వంటి విద్యలు అభ్యసించాలి. అందుకు బలమైన పౌష్టికాహారం ఉండాలి. అది మీకు అందకపోతే టీచర్లకు, సంబంధిత అధికారులకు తెలియచేయండి. మేము వెంటనే దాన్ని సరి చేస్తాము” అన్నారు.
గార్డ్ ఆఫ్ హానర్ తో విద్యార్ధునుల స్వాగతం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కి విద్యార్ధినులు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తూ.. గార్డ్ ఆఫ్ హానర్ తో స్వాగతం పలికారు. విద్యార్ధిని భావన ఆధ్వర్యంలో నిర్వహించిన గార్డ్ ఆఫ్ హానర్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకుంది. విద్యార్థినులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేకంగా మార్చ్ ఫాస్ట్ చేసిన బృందాన్ని, పి.టి. టీచర్ ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారితోపాటు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు
గురుకులంలో సౌకర్యాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. భోజనం, ఉదయం అల్పాహారం మెనూ ఎలా ఉంటుంది అని విద్యార్ధునులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధునులు గురుకులంలోనే ఎంసెట్ కోచింగ్ ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ని కోరారు. 15 రోజుల్లో గురుకులంలో ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.