Breaking News

వైసీపీ సోషల్ మీడియాను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా ప్రతినిధులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా సమావేశం మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని., విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నాయో స్వయంగా డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు వింటేనే అర్థమైపోతుందన్నారు. ఈ వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేయడం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందన్నారు. గుంటూరు జిల్లా వల్లభాపురంలో రైతు ఆళ్ల జగదీశ్వరరెడ్డి, కృష్ణాజిల్లా కానూరు సనత్ నగర్లో పంక్చర్ షాప్ యజమాని ఇస్మాయిల్ మహ్మద్ సహా ఇప్పటివరకు వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన అక్రమ కేసులే ఇందుకు నిదర్శనమన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 6 అక్రమ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను సైతం ఉల్లంఘించి అర్థరాత్రి వేళ వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. చివరకు అయ్యప్ప మాలలో ఉన్న వారిపైనా దౌర్జన్యంగా వ్యవహరించి అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. అదే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా లండన్, అమెరికా సహా ఇతర దేశాల నుంచి దొంగ ఐడీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వ హనన చేస్తూ పోస్టులు పెట్టేవారని గుర్తుచేశారు. వైఎస్ విజయమ్మ గారి కారు టైర్ పంక్చర్ అయిన సమయంలోనూ ఏరకంగా విష ప్రచారం చేశారో చూశామన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలకు వాస్తవాలను తెలియజేసినందుకు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు ఎవరూ అధైర్యపడొద్దని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ధైర్యం చెప్పారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా కేంద్ర కార్యాలయం నుంచి వెంటనే స్పందన ఉంటుందన్నారు. రాష్ట్రంలో 40 శాతం ఓటు బ్యాంకుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. గడిచిన 5 నెలల కాలంలో ఈ శాతం మరింత పెరిగిందన్నారు. ప్రజలందరూ వైసీపీ వైపు చూస్తున్నారని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలందరూ ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కనుక సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ ధైర్యంగా ఉండాలని.. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టడానికైనా తాము సిద్ధమని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ప్రజలకు వివరించాలన్నారు. అలాగే ప్రతినెలా ఒకటో తేదీన నియోజకవర్గ సోషల్ మీడియా సమావేశం క్రమం తప్పకుండా నిర్వహించుకుందామని తెలియజేశారు.

అంజిరెడ్డి మాట్లాడుతూ..
సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. చివరకు డకౌట్ అయిందని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థను కూడా చివరకు కూటమి జేబు సంస్థగా మార్చివేసి.. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా బలంగా ఉండేవారని.. కానీ ఈ ప్రభుత్వంలో కనీస రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఏ ఇంట్లో సంక్షేమం, ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో మల్లాది విష్ణు సహకారంతో తన డివిజన్లో రూ. 60 కోట్ల మేర అభివృద్ధి పనులు జరగగా.. ఈ ప్రభుత్వంలో పనులన్నీ ఆగిపోయాయన్నారు. వీటన్నింటినీ సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, నాయకులు అలంపూర్ విజయ్, కుక్కల రమేష్, కాళ్ల ఆదినారాయణ, సోషల్ మీడియా కన్వీనర్లు, యాక్టివిస్టులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *