బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల తలసరి ఆదాయం రూ.నాలుగు లక్షలకు పెంచడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తుందని జిల్లా ఇంఛార్జి మంత్రి గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్లకు తొలిసారిగా వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి పార్థసారథి మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని జిల్లా ఇంఛార్జి మంత్రి అన్నారు. రూ.10.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీకి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సఫలీకృతులవుతారని చెప్పారు. దశాబ్దాల కాలం పోరాటాలతో నిర్మించిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే తాగు, సాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి అవసరాలు తీరుతాయన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చేపట్టిన రాజధాని అమరావతి నిర్మాణం నిలిచిపోయిందన్నారు. పునఃనిర్మాణానికి బ్యాంకులన్నీ ముందుకు వస్తున్నాయన్నారు. అమరావతి అభివృద్ధితోనే సాఫ్ట్ వేర్ సంస్థలు రాష్ట్రంలోకి వస్తాయన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబెట్టేందుకు సీఎం కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర అన్ని రంగాలలో అభివృద్ధిలోకి వెళ్లేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని వర్ణించారు.
అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు బాపట్ల జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయని ఇంఛార్జి మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు బాపట్లను అభివృద్ధి చేస్తామన్నారు. తీర ప్రాంతాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన బాపట్లలో సాగునీటి కాల్వల మరమ్మత్తులు చేస్తామన్నారు. సకాలంలో టెండర్లు పిలిచి పనులు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ కనీసం వంద రోజులు పనులు ఉపాధి హామీ పథకం కింద చూపించ లేక పోయినట్లు గుర్తించామన్నారు. కార్డుదారులందరికీ పని కల్పించాలని పలు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎన్టీఆర్ గృహాల నిర్మాణ పథకానికి రూ.800 కోట్ల బకాయిలపై నివేదికలు సేకరిస్తున్నామన్నారు. జర్నలిస్టుల పిల్లల ఫీజులలో 50% రాయితీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు గృహాలు మంజూరు, అవసరమైతే ఇల్లు నిర్మించేందుకు సీఎం కృషి చేస్తున్నారని వివరించారు.
ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.